NBK 111: బాలయ్య సరసన నాలుగోసారి నయనతార.. బాలయ్య – గోపిచంద్ మలినేని మూవీ అప్డేట్
NBK 111: నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ మరోసారి రికార్డులను తిరగరాయడానికి సిద్ధమవుతోంది. వీరిద్దరి కలయికలో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘వీర సింహా రెడ్డి’ ఘన విజయం తర్వాత, వీరి కాంబినేషన్‌లో రాబోతున్న రెండో ప్రాజెక్ట్ ఎన్‌బీకే111 (NBK111)పై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు మేకర్స్ అదిరిపోయే శుభవార్త అందించారు. ఎన్‌బీకే111 సినిమాలోని కథానాయికను ప్రకటిస్తూ, ఒక స్పెషల్ వీడియోను విడుదల చేశారు. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన తమిళ బ్యూటీ, లేడీ సూపర్ స్టార్ నయనతార నటించబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
గతంలో బాలకృష్ణ, నయనతార కాంబినేషన్‌లో వచ్చిన ‘సింహా’, ‘శ్రీరామ రాజ్యం’, ‘జై సింహా’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలు సాధించాయి. దీంతో, ఇప్పుడు నాలుగోసారి ఈ సక్సెస్‌ఫుల్ జోడీ తెరపై సందడి చేయబోతుండటంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేవు.
‘ఎన్‌బీకే111’ ప్రాజెక్ట్ నవంబర్ 26న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ భారీ యాక్షన్ డ్రామా చరిత్ర, వర్తమానం మేళవింపుగా శక్తిమంతమైన కథాంశంతో రూపొందనుందని సమాచారం. ముఖ్యంగా, ఇందులో బాలకృష్ణ రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నారు. ఒక పాత్రలో ఆయన రాజుగా, మునుపెన్నడూ చూడని లుక్‌లో అలరించనున్నారని తెలుస్తోంది. ఈ ‘రాజు’ పాత్ర బాలయ్య అభిమానులకు పెద్ద విందులా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ భారీ యాక్షన్ డ్రామాను ప్రముఖ నిర్మాత వెంకట సతీశ్ కిలారు వృద్ధి సినిమాస్ పతాకంపై నిర్మిస్తున్నారు. బాలయ్య, గోపీచంద్ మలినేని, నయనతార వంటి స్టార్ కాంబినేషన్‌తో వస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా మరో ‘అఖండ’ లాంటి విజయాన్ని సాధిస్తుందని సినీ విశ్లేషకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
