Nara Lokesh: అన్నా.. నా నియోజకవర్గానికి వచ్చి టికెట్‌కు మీరు డబ్బులు ఇవ్వడం ఏంటన్నా?
Nara Lokesh: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌లో మహిళల కోసం ‘స్త్రీ శక్తి’ ఉచిత బస్సు ప్రయాణ పథకం గురువారం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పురంధరేశ్వరితో కలిసి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నేతలు మహిళా ప్రయాణికులతో కలిసి ఉండవల్లి నుంచి విజయవాడ బస్టాండ్ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఈ పర్యటనలో పలు ఆసక్తికరమైన సంఘటనలు, సరదా సంభాషణలు చోటుచేసుకున్నాయి.
బస్సు ప్రయాణం సందర్భంగా ముందుగా సీఎం చంద్రబాబు తమ టికెట్‌ను కొనుగోలు చేసేందుకు మహిళా కండక్టర్‌కి డబ్బులు అందించారు. అయితే, అక్కడే ఉన్న మంత్రి నారా లోకేశ్ జోక్యం చేసుకుని ఆ డబ్బులను వెనక్కి ఇప్పించారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా తమ టికెట్ కోసం డబ్బులు ఇవ్వబోగా, లోకేశ్ ఆయన్ను అడ్డుకున్నారు. “అన్నా, నా నియోజకవర్గం (మంగళగిరి)లో మీరు డబ్బులు చెల్లించడం ఏంటి?” అని ప్రశ్నించారు.
తరువాత తనతో పాటు సీఎం, డిప్యూటీ సీఎం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు టికెట్ ఛార్జీలను లోకేశ్ స్వయంగా చెల్లించారు. ఈ సందర్భంగా ఆయన బస్సులోని వారందరినీ ఉద్దేశించి, “టికెట్ ఛార్జీలకు నేనే ఖర్చు చేశాను కాబట్టి, మా నియోజకవర్గానికి ప్రభుత్వం నుంచి ఎక్కువ నిధులు తీసుకుంటాను” అని సరదాగా వ్యాఖ్యానించడంతో బస్సులోని ప్రయాణికులంతా నవ్వులతో సందడి వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ‘స్త్రీ శక్తి’ పథకం మహిళలకు ప్రయాణ స్వేచ్ఛతో పాటు ఆర్థిక భద్రతను, సామాజిక గౌరవాన్ని ఇస్తుందని తెలిపారు. గత ప్రభుత్వ విధానాల వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను సమర్థంగా గాడిలో పెడుతూనే కూటమి ప్రభుత్వం సూపర్‌సిక్స్ హామీలను అమలు చేస్తోందని ఆయన చెప్పారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఉచిత బస్సు ప్రయాణ హామీ ఇవ్వగా, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇది సాధ్యమేనా అని తాను అనుమానం వ్యక్తం చేశానని, అయితే చంద్రబాబు తన అనుభవంతో ఈ హామీని అమలు చేశారని పవన్ తెలిపారు.
ప్రయాణికుల భద్రత కోసం బస్సుల్లో సీసీ కెమెరాలు, మహిళా కండక్టర్లకు బాడీవార్న్ కెమెరాలు అందిస్తామని వివరించారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలంతా అండగా నిలబడ్డారని, అందుకే తాము కార్యక్రమాలను బలంగా అమలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.