Mahavatar Narasimha: కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న మహావతార్ నరసింహా..!
Mahavatar Narasimha: సాధారణంగా పెద్ద సినిమాలకు లభించే భారీ ప్రచారం, హైప్ లేకుండానే థియేటర్లలోకి వచ్చిన యానిమేటెడ్ చిత్రం ‘మహావతార్ నరసింహ’ బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తోంది. పెద్ద బడ్జెట్ స్టార్ చిత్రాలు కూడా కష్టపడుతున్న సమయంలో, ఈ యానిమేటెడ్ మూవీ అనూహ్య విజయాన్ని సాధించి సినీ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఈ చిత్రం సాధిస్తున్న వసూళ్ల వివరాలు చూస్తే ఆశ్చర్యపోక తప్పదు.
చిత్ర నిర్మాణానికి రూ.15 కోట్లే..
‘కేజీఎఫ్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్, క్లీమ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి దాదాపు రూ. 15 కోట్లు బడ్జెట్ అయినట్లు ట్రేడ్ నిపుణులు అంచనా వేశారు. ఇందులో నటులు లేకపోవడం వల్ల యానిమేషన్, వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్, మ్యూజిక్ టీమ్‌లకే ఎక్కువ ఖర్చు అయినట్లు తెలుస్తోంది. హిందూ పురాణాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రీ-రిలీజ్ బిజినెస్‌లో కూడా మంచి స్పందన లభించింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే రూ. 30 కోట్ల గ్రాస్ వసూళ్లు అవసరం అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.
12 రోజులకే రూ.135 కోట్ల గ్రాస్ వసూలు..
అయితే, ఈ సినిమా ఆ అంచనాలను ఎప్పుడో దాటేసింది. విడుదలైన 12వ రోజు వరకు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 135 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. ఇందులో ఇండియాలో రూ. 120 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4 కోట్లు గ్రాస్ కలెక్షన్లు ఉన్నాయి. హిందీ వెర్షన్ అత్యధికంగా రూ. 78.2 కోట్లు నెట్ కలెక్ట్ చేయగా, తెలుగులో రూ. 23.72 కోట్లు, కన్నడలో రూ. 2.79 కోట్లు, తమిళం, మలయాళంలో కూడా మంచి వసూళ్లు సాధించింది. ఈ అనూహ్యమైన విజయం సినిమా బృందానికి రూ. 100 కోట్ల పైగా లాభాలను తీసుకొచ్చిందని సమాచారం. ఎలాంటి ప్రచారం లేకుండానే కేవలం కంటెంట్‌తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ఈ సినిమా భారతీయ సినీ చరిత్రలో ఓ కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిందని చెప్పవచ్చు.