హైదరాబాద్ లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మాజీ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి కన్నుమూశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మూడు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ క్యాబినెట్ లో హోం మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
కార్మిక సంఘ నాయకుడిగా నాయిని నర్సింహారెడ్డి అందరికి సూపరిచితులు. నల్గొండ జిల్లాకు చెందిన నాయిని 1960 వ దశకంలో హైదరాబాద్ వచ్చారు. కార్మికుల హక్కుల పోరాటంతో.. కార్మిక నాయకుడిగా ఎదిగారు. 1969 తొలి తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్ గా పాలు పంచుకున్నారు నాయిని. ఆ తర్వాత క్రియాశీలక రాజకీయాలలోకి వచ్చారు. 1978 లో మొదటి సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
1985, 2004 లో ఉమ్మడి ఆంద్రప్రదేశ్ అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2001 తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు నుంచి కేసీఆర్ వెంట నడిచారు నాయిని. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పొత్తులో భాగంగా నాటి వైఎస్ రాజశేఖరరెడ్డి క్యాబినెట్ లో మంత్రిగా చేరారు నాయిని. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలలో వైఎస్ క్యాబినెట్ నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చారు.
2014 లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన తర్వాత జరిగిన ఎన్నికల్లో టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. 2014 లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి నాయిని ఆసక్తి చూపలేదు.
దీనితో సీఎం కేసీఆర్ నాయినికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి పెద్దల సభకు పంపారు. తెలంగాణ సీఎం కేసీఆర్ క్యాబినెట్ లో మొదటి హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టారు నాయిని నర్సింహారెడ్డి. 2001 నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన నాయిని. కేసీఆర్ కి అత్యంత సన్నిహితుడు. ఇటీవలే నాయిని నర్సింహారెడ్డి ఎమ్మెల్సీ పదవి కాలం ముగిసింది .
కరోనా తో ఆసుపత్రిలో చేరిన నాయిని కొలుకున్నారు. అయితే కొద్ది రోజులకే లంగ్ ఇన్ఫెక్షన్ సోకడంతో నాయిని ఆరోగ్యం క్షిణించింది. కొద్ది రోజులుగా హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న నాయిని బుధవారం నాడు కన్నుమూశారు. నాయినికి భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. నాయిని అల్లుడు శ్రీనివాస్ రెడ్డి క్రియాశీలక రాజకీయలలో ఉన్నారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ కార్పొరేటర్ గా కొనసాగుతున్నారు.