NBK111: బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కొత్త సినిమా షురూ.. చారిత్రక కథాంశంతో..
NBK111: అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతున్న కొత్త చిత్రం ఘనంగా ప్రారంభమైంది. ‘వీర సింహారెడ్డి’ వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న ఈ రెండో ప్రాజెక్ట్… టాలీవుడ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఈ సినిమా ‘#NBK111’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉంది.
తాజాగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన అధికారిక అప్‌డేట్‌ను విడుదల చేస్తూ, ఈ రోజు (నవంబర్ 26, 2025) పూజా కార్యక్రమాలతో ప్రాజెక్ట్‌ను లాంఛనంగా ప్రారంభించినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పవర్‌ఫుల్ ఫస్ట్-లుక్ పోస్టర్ అభిమానుల అంచనాలను భారీగా పెంచింది.
నిర్మాణ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, ‘NBK111’ ఒక చారిత్రక కథాంశం నేపథ్యంతో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు తెలిపారు. విడుదలైన పోస్టర్‌లో బాలయ్య రెండు విభిన్నమైన, శక్తివంతమైన లుక్స్‌లో కనిపించారు. ఒక లుక్‌లో పౌరుషం ఉట్టిపడే యోధుడి పాత్రలో ఉండగా, మరో లుక్‌లో మెడలో రుద్రాక్షమాల ధరించి పవర్ ఫుల్‌గా కనిపించారు. కోటల నేపథ్యంతో రూపొందించిన ఈ పోస్టర్‌ను బట్టి చూస్తే, గోపీచంద్ మలినేని బాలయ్య కోసం ఒక భారీ యాక్షన్ డ్రామాను ప్లాన్ చేస్తున్నట్లు అర్థమవుతోంది.
ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తున్నారు. ‘సింహా’, ‘శ్రీరామరాజ్యం’, ‘జైసింహా’ వంటి హిట్ చిత్రాల తర్వాత ఈ అద్భుతమైన కాంబోలో రాబోతున్న నాలుగో సినిమా ఇది. ఈ హిట్ కాంబినేషన్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు. బాలకృష్ణ – తమన్ కాంబినేషన్ అంటే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. వీరి గత చిత్రాలైన ‘అఖండ’, ‘వీర సింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’ వంటి సినిమాల పాటలు, నేపథ్య సంగీతం సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ హిట్ కాంబో మళ్లీ రిపీట్ అవుతుండటం సినిమా విజయంపై మరింత నమ్మకాన్ని పెంచుతోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
