Shwetha Menon: అశ్లీల చిత్రంలో నటించిన శ్వేతా మీనన్..!
Shwetha Menon: మలయాళ సినీ పరిశ్రమలో ప్రముఖ నటిగా పేరున్న శ్వేతా మీనన్, వివాదంలో చిక్కుకున్నారు. ఐటీ చట్టంతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద ఆమెపై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. కేరళలో సినీ కళాకారుల సంఘం “అమ్మ” (AMMA) ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో, ఆమె అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఈ కేసు ఇప్పుడు సంచలనంగా మారింది.
కేసు ఎందుకంటే..?
ఎర్నాకుళం చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాల మేరకు ఎర్నాకులం సెంట్రల్ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. సామాజిక కార్యకర్త మార్టిన్ మేనచేరి దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా పోలీసులు చర్యలు తీసుకున్నారు. అశ్లీల కంటెంట్ ఉన్న చిత్రాలు, ప్రకటనల్లో నటించడం ద్వారా ఆమె అనైతికంగా డబ్బు సంపాదించారని పిటిషన్‌లో ఆరోపించారు. ‘పలేరి మాణిక్యం’, ‘రతినిర్వేదం’, ‘కలిమన్ను’ వంటి చిత్రాల్లో శృంగార సన్నివేశాలు, అలాగే కండోమ్ ప్రకటనల్లో నటించి, ఆ కంటెంట్‌ను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేశారని మార్టిన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ చర్యలు భారతీయ చట్టాలకు విరుద్ధమని ఆయన ఆరోపించారు. దీంతో, పోలీసులు ఐటీ చట్టం సెక్షన్ 67Aతో పాటు, ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ (PITA)లోని సెక్షన్ 3, 5 కింద కేసు నమోదు చేశారు. ఈ అభియోగాలన్నీ నాన్ బెయిలబుల్ కేటగిరీ కిందకు వస్తాయి.
‘అమ్మ’ ఎన్నికలు, రాజకీయ వివాదం..?
ఈ నెల 15న ‘అమ్మ’ ఎన్నికలు జరగనున్నాయి. శ్వేతా మీనన్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు. మొదటగా ఆరుగురు నామినేషన్లు వేసినా, నలుగురు వెనక్కి తగ్గడంతో ఇప్పుడు శ్వేతతో పాటు నటుడు దేవన్ మాత్రమే పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో శ్వేత గెలిస్తే, ఆమె ‘అమ్మ’కు తొలి మహిళా అధ్యక్షురాలు అవుతారు. ఇలాంటి కీలక సమయంలో ఆమెపై కేసు నమోదు కావడం, ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే చర్చ జరుగుతోంది.
శ్వేతా మీనన్‌పై కుట్ర జరిగిందా?..
గతంలో కాస్టింగ్ కౌచ్ ఆరోపణల నేపథ్యంలో జస్టిస్ హేమా కమిటీ నివేదిక తర్వాత, అప్పటి అధ్యక్షుడు మోహన్‌లాల్ రాజీనామా చేశారు. ఆ తరువాత కొత్త నాయకత్వం కోసం ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్వేతా మీనన్‌పై వచ్చిన ఈ కేసు వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.