భారీ వర్షాలు వరదల మూలంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని కోరుతూ లేఖ విడుదల చేశారు. ఆ లేఖలో పలు విషయాలు ప్రస్తావించారు . పవన్ లేఖలో ప్రస్తావించిన అంశాలు ఏమిటంటే భారీ వర్షాల కారణంగా రైతు పండించిన పంటలను పూర్తిగా నష్టపోవడం దురదృష్టకరం. ఖరీఫ్ సీజన్ లో పెట్టుబడి పెట్టిన ప్రతి పైసా నీటిపాలైంది. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా వ్యవహరించలేదు.
నష్టం అంచనాలను రూపొందించడంలో ప్రభుత్వం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తుంది. గతేడాది జరిగిన నష్టానికి సంబంధించిన పరిహారం ఇప్పటికీ కూడా చెల్లించలేదని రైతాంగం ఆవేదన చెందుతున్నారని, ఈసారి పరిహారం ఎప్పటికి వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. భారీ వర్షాలు వరదలకు తీవ్రంగా ప్రభావితమైన కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన నాయకులు పర్యటించి ముంపులో ఉన్న పొలాలను పరిశీలించి రైతులను పరామర్శించారని అన్నారు.
ఇందుకు సంబంధించిన వివరాలను జనసేన పార్టీకి తెలియజేశారు. ప్రాథమిక అంచనాల ప్రకారమే 2. 72 లక్షల ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలోనే పంటలు నష్టపోయి ఉంటారని క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లిన నాయకులు తెలియజేశారు.
ప్రధానంగా వరి పంట నీట మునిగి కుళ్ళిపోతుంది ఉభయగోదావరి కృష్ణా జిల్లాలో వరి సాగు చేసే వారి పరిస్థితి దైన్యంగా ఉంది. ఉద్యాన పంటలు వేసిన వారు కృష్ణలంక భూములలో కూరగాయలు సాగు చేసిన వారు కడియం ప్రాంతంలో నర్సరీ రైతులు నష్టాల పాలయ్యారు. ఈ విపత్కర కాలంలో పెట్టుబడి రాయితీలు చెల్లిస్తాం నష్టాలను లెక్కిస్తాం అనే ధోరణిని ప్రభుత్వం, పాలకులు విడిచిపెట్టాలి. తక్షణమే పరిహారం తెలిస్తే తదుపరి పంటకు రైతులు మానసికంగా సంసిద్ధులు అవుతారు లేనిపక్షంలో కరువులో చేసిన అప్పులు తీర్చేందుకు కొత్త అప్పు కోసం ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించి రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంది.
గతేడాది ప్రకృతి విపత్తుల మూలంగా నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ చెల్లించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని వెల్లడిస్తోంది. ఆ నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తున్నా ఇప్పటివరకు రైతు ఖాతాలోకి ఆ సొమ్ములు జమ కాలేదు. అందువల్ల నష్టపోయిన రైతులకు మొత్తం పెట్టుబడిని పరిహారంగా తక్షణమే చెల్లించాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. అంతేకాక వరద ముంపులో చిక్కుకుపోయిన వారికి రేషన్ పరిహారం చెల్లించడంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంలో మానవీయత లోపించింది. నివాసాలు నేత మునిగిపోయి బాధలో ఉన్నప్పుడు నిత్యావసరాలు అందించి ఆదుకోవాలని కూడా వారం రోజుల పాటు ముంపు ఫోన్ చేసి వాటిని అందిస్తామని చెప్పడం భావ్యం కాదు ఈ మేరకు డిజాస్టర్ మేనేజ్ మెంట్ శాఖ నుండి వచ్చిన జీవో నెంబర్ 19 ఉపసంహరించుకోవాలి. వరద ముంపు బారిన పడిన ప్రతి కుటుంబాన్ని ఆదుకొని ఉపాధికి దూరమైన కాలానికి పరిహారం ఇవ్వాలని పవన్ ప్రభుత్వాన్ని కోరారు.