NTR Neel Movie: ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ సినిమాపై రవి బస్రూర్ సంచలన వ్యాఖ్యలు.. ‘కేజీఎఫ్, సలార్‌ల’కు మించి..
NTR Neel Movie: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రంపై సంగీత సంచలనం రవి బస్రూర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి రికార్డులు సృష్టించిన చిత్రాలకు మించి ఈ కొత్త సినిమా ఉండబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
తాజాగా ఓ ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవి బస్రూర్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. ప్రశాంత్ నీల్‌తో కలిసి పనిచేయడం తనకు ఎప్పుడూ సొంత ఇంటికి వచ్చిన అనుభూతిని ఇస్తుందని తెలిపారు. తమ ఇద్దరి మధ్య మాటలు తక్కువ, పని ఎక్కువ ఉంటుందని, అందుకే అవుట్‌పుట్ అత్యంత శక్తిమంతంగా వస్తుందని వివరించారు.
ఈ చిత్రం విజువల్స్ పరంగానే కాకుండా, సంగీతం పరంగా కూడా అత్యంత భారీ స్థాయిలో ఉంటుందని రవి బస్రూర్ స్పష్టం చేశారు. నీల్ గత చిత్రాలైన ‘కేజీఎఫ్’, ‘సలార్’ చిత్రాల నేపథ్య సంగీతం ఒక స్థాయిలో ఉంటే, ఈ ఎన్టీఆర్ చిత్రానికి అందిస్తున్న మ్యూజిక్ మాత్రం వాటికి పూర్తిగా భిన్నంగా ఉంటుందని తెలిపారు. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా కథలోని భావోద్వేగాలను పతాక స్థాయిలో ఆవిష్కరించేందుకు అనేక కొత్త సంగీత పరికరాలను ఉపయోగిస్తున్నామని, ఇది ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని చెప్పారు. మ్యూజిక్ శక్తిమంతంగా ఉంటూనే, అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంటుందని రవి బస్రూర్ పేర్కొన్నారు.
‘దేవర’ తర్వాత ఎన్టీఆర్, ‘సలార్’ భారీ విజయం తర్వాత ప్రశాంత్ నీల్ కలిసి చేస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన టాలెంటెడ్ నటి రుక్మిణీ వసంత్ (Rukmini vasanth) నటిస్తున్నారు. ‘డ్రాగన్’ అనే పేరును ఈ సినిమాకు పరిశీలిస్తున్నట్లుగా ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది.
పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో తారక్ మునుపెన్నడూ చూడని మాస్ అవతార్‌లో, అద్భుతమైన కొత్త లుక్‌లో కనిపించబోతున్నారని సమాచారం. భారీ అంచనాలతో కూడిన ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రవి బస్రూర్ వ్యాఖ్యలతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయని చెప్పవచ్చు.
