Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ హంగామా: విడుదలకు ముందే రికార్డుల మోత
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, రాజకీయాలు, పాలనతో బిజీగా ఉన్న పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ సినిమాను విడుదల చేసిన పవన్, ఇప్పుడు యువ దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్న ‘ఓజీ (OG)’ చిత్రం విడుదలకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా, విడుదల తేదీ సమీపిస్తున్న తరుణంలో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.
భారీ అంచనాలతో వస్తున్న ‘ఓజీ’
‘ఆర్ఆర్ఆర్’ వంటి భారీ చిత్రాన్ని నిర్మించిన డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య దాదాపు రూ. 250 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్‌గా ప్రియాంక మోహన్ నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా కనిపించనున్నారు. అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శుభలేఖ సుధాకర్, శియా రెడ్డి, హరీష్ ఉత్తమన్ వంటి ప్రముఖ నటీనటులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్.ఎస్. థమన్ సంగీతం, రవి కె. చంద్రన్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన బలం కానున్నాయి.
రికార్డుల స్థాయిలో ప్రీ-రిలీజ్ బిజినెస్
‘ఓజీ’ సినిమా విడుదలకు ముందే రికార్డు స్థాయిలో ప్రీ-రిలీజ్ బిజినెస్ చేస్తోందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం, తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ రూ. 155 కోట్లకు పైగా పలుకుతున్నట్లు సమాచారం. నైజాం ప్రాంతంలో రూ. 60 కోట్లు, ఆంధ్రాలో రూ. 70 కోట్లు, సీడెడ్‌లో రూ. 25 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా, ఈ సినిమా శాటిలైట్ హక్కులను స్టార్ గోల్డ్ ఛానల్ భారీ ధరకు దక్కించుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
విదేశాల్లోనూ జోరుగా బుకింగ్స్
‘ఓజీ’ చిత్రం తెలుగుతో పాటు పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతోంది. ఇప్పటికే అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్‌లు మొదలయ్యాయి. ఆగస్టు 29 నుంచి అమెరికాలో బుకింగ్స్ ఓపెన్ అవుతాయని, సెప్టెంబర్ 24న ప్రీమియర్ షోలు ప్రదర్శిస్తామని అక్కడి డిస్ట్రిబ్యూటర్ ప్రత్యంగిరా సినిమాస్ ప్రకటించింది. దీంతో, పవన్ కళ్యాణ్ అడ్వాన్స్ బుకింగ్స్‌లో కొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ‘ఓజీ’ సెప్టెంబర్ 25న ఏకపక్షంగా విడుదల కానుండటంతో, బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించడం ఖాయమని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
