OG Movie: ‘ఓజీ’ షూటింగ్ పూర్తి.. పవన్ కళ్యాణ్, సుజీత్, తమన్ ‘మిలియన్ డాలర్ పిక్చర్’ వైరల్
OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఓజీ’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రముఖ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో, ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 25న దసరా కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఒక పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటిస్తున్నారు. ఆయన స్టైలిష్ లుక్, మ్యానరిజమ్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. ఇదివరకే విడుదలైన గ్లింప్స్, టీజర్‌లు, ఫస్ట్ లుక్ పోస్టర్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సినిమాపై ఉన్న హైప్‌ను మరింత పెంచుతూ చిత్రబృందం తాజాగా ఒక కొత్త ఫోటోను విడుదల చేసింది. ఈ ఫోటోలో పవన్ కళ్యాణ్, సుజీత్, తమన్ ఒకే ఫ్రేమ్‌లో బ్లాక్ దుస్తుల్లో కనిపించారు. పవన్ వారిద్దరిపై ఆప్యాయంగా చేతులు వేసి నవ్వుతూ ఉన్న ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ ఫోటోకు “మిలియన్ డాలర్ పిక్చర్” అనే క్యాప్షన్ ఇవ్వడం అభిమానులను మరింతగా ఆకర్షించింది.
‘ఓజీ’ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘ఫైర్ స్ట్రోమ్’, ‘సువ్వి సువ్వి’ పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తమన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అవుతుందని భావిస్తున్నారు. త్వరలోనే మరో బ్లాక్‌బస్టర్ పాటను విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీర్ అనే పాత్రలో, ప్రియాంక మోహన్ కన్మణి అనే పాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి ఈ చిత్రంతో తెలుగు తెరకు విలన్‌గా పరిచయం కానున్నారు. అలాగే, శ్రియ రెడ్డి, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్ వంటి ప్రముఖ నటులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఈ చిత్రం ఒక మైలురాయిగా నిలిచిపోతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. దసరా పండగకు ‘ఓజీ’ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
