Pa Ranjith: పా.రంజిత్ కొత్త ప్రాజెక్ట్‌లో అక్కినేని కోడలు శోభిత.. విలన్‌గా హీరో
Pa Ranjith: సామాజిక అంశాలు, దళిత పోరాటాలు, అణగారిన వర్గాల బాధలను అత్యంత శక్తివంతంగా తెరకెక్కించడంలో కోలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సెన్సిబుల్ దర్శకుడు పా. రంజిత్ మరో విభిన్న కథాంశంతో వార్తల్లో నిలిచారు. అంబేద్కర్ భావజాలాన్ని స్ఫూర్తిగా తీసుకుని, ప్రేక్షకుల్లో చైతన్యం నింపే సినిమాలు తీస్తున్న ఈ దర్శకుడు, తన తదుపరి ప్రాజెక్ట్‌కు సంబంధించిన కాంబినేషన్లతో ఇప్పుడు చర్చనీయాంశమయ్యారు.
గతేడాది విక్రమ్‌తో ‘తంగలాన్’ వంటి ప్రతిష్టాత్మక చిత్రాన్ని పూర్తి చేసిన రంజిత్, ప్రస్తుతం తన కొత్త సినిమాపై దృష్టి సారించారు. ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వెలువడకపోయినా, ఈ ప్రాజెక్ట్‌లో అక్కినేని కోడలు, తెలుగు నటి శోభితా ధూళిపాళ కీలక పాత్ర పోషించబోతున్నారనే ఆసక్తికర సమాచారం లీకైంది. గతేడాది డిసెంబర్లో నాగ చైతన్యను వివాహం చేసుకున్న తర్వాత, శోభిత ఇప్పటివరకు కొత్త సినిమా ఏదీ ప్రకటించలేదు. ఆమె ఒక వెబ్ సిరీస్‌తో పాటు, ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నట్లు తమిళ వర్గాలు చెబుతున్నాయి.
ఈ సినిమా ఒక పకడ్బందీ సైన్స్ ఫిక్షన్ పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందుతోందని, దీనికి తాత్కాలికంగా ‘వెట్టువం’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని సమ్మర్ రిలీజ్ లక్ష్యంగా చిత్రీకరిస్తున్నారు. ఇటీవలే ప్రధాన తారాగణంపై ఒక భారీ వరద సీక్వెన్స్‌ను కూడా చిత్రీకరించినట్లు కోలీవుడ్ మీడియా రిపోర్ట్ చేసింది.
ఈ చిత్రంలో ‘అట్టకత్తి’ ఫేమ్ నటుడు దినేష్ హీరోగా నటిస్తుండగా, ఆయనకు జోడీగా శోభిత ధూళిపాళ కనిపించనుందని తెలుస్తోంది. అంతకుమించి, ఈ ప్రాజెక్టులో మరో కీలకమైన ఆకర్షణ ఏంటంటే.. కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారని టాక్. పా.రంజిత్-ఆర్య కాంబినేషన్లో వచ్చిన ‘సార్పట్టా పరంబరై’ ఓటీటీలో సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ చిత్రానికి సీక్వెల్‌గా ‘సార్పట్టా 2’ తెరకెక్కించాలని భావిస్తున్నప్పటికీ, అంతకుముందు రంజిత్ ఈ కొత్త ప్రాజెక్ట్ ‘వెట్టువం’లో ఆర్యకు పవర్ ఫుల్ విలన్ రోల్ ఇచ్చారని సమాచారం.
పా.రంజిత్, శోభిత ధూళిపాళ, దినేష్, ఆర్య వంటి అద్భుతమైన కాంబినేషన్‌తో రాబోతున్న ఈ సైన్స్ ఫిక్షన్ పొలిటికల్ డ్రామా గురించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే, చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడక తప్పదు.
