Paresh Rawal: ఆస్కార్ అవార్డుల్లోనూ లాబీయింగ్: పరేశ్ రావల్ కామెంట్స్
Paresh Rawal: సినీ పరిశ్రమలో పురస్కారాల చుట్టూ అల్లుకున్న అంశాలపై విలక్షణ నటుడు పరేశ్ రావల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిష్ఠాత్మక అవార్డుల ప్రక్రియలోనూ ‘లాబీయింగ్’ పాత్ర ఉంటుందని, ప్రపంచవ్యాప్తంగా ఇదే పద్ధతి కొనసాగుతోందని స్పష్టం చేశారు. అయితే తనకు బిరుదులు, ట్రోఫీల కంటే తన పనికి దర్శకనిర్మాతలు ఇచ్చే ప్రశంసలే అత్యంత విలువైనవని, అవి తనను సంతృప్తి పరుస్తాయని ఆయన వెల్లడించారు.
తాజాగా ఒక పోడ్‌కాస్ట్‌లో పాల్గొన్న పరేశ్ రావల్, సినీ అవార్డుల పట్ల తన నిష్కపటమైన అభిప్రాయాన్ని పంచుకున్నారు. జాతీయ అవార్డుల వంటి అత్యంత గౌరవనీయమైన పురస్కారాల్లో కూడా కొంతమేర లాబీయింగ్ ప్రభావం ఉండే అవకాశం ఉందని తెలిపారు. మిగతా సినీ అవార్డుల కంటే నేషనల్ అవార్డుకు మంచి గౌరవం ఉన్నప్పటికీ, ఈ ప్రయత్నాలు జరుగుతుంటాయన్నారు.
అంతేకాదు అత్యున్నతమైన అంతర్జాతీయ పురస్కారం ఆస్కార్స్ కూడా లాబీయింగ్‌కు అతీతం కాదని పరేశ్ రావల్ పేర్కొన్నారు. చిత్రబృందం తమ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుని, కొన్ని ప్రత్యేక పార్టీలు, సమావేశాల ద్వారా ఈ ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్తుందని ఆయన వివరించారు. చిత్రనిర్మాతలు జ్యూరీ సభ్యులను తమవైపు ఆకర్షించేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారని, ఒక్కోసారి ‘ఇది ఫలానా పెద్ద దర్శకుడి సినిమా’ అంటూ ప్రత్యేక శ్రద్ధ చూపించే సందర్భాలు కూడా ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.
“నాకు అవార్డుల గురించి అంతగా తెలియదు. కానీ, అవార్డులతో పోలిస్తే, నా దర్శకుడు ‘కట్’ చెప్పినప్పుడు, రచయిత నా నటన బాగుందని సంతృప్తి వ్యక్తం చేసినప్పుడే నా పనికి నిజమైన గుర్తింపు దక్కినట్లుగా భావిస్తాను. నా ఉత్సాహం, ప్రేరణ అక్కడే ముగుస్తాయి. నాకు అంతకంటే ఏమీ అవసరం లేదు.” – పరేశ్ రావల్
అవార్డులు, బిరుదులు కేవలం చిత్ర పరిశ్రమ నుండి దక్కే ఒక గుర్తింపు మాత్రమే కావచ్చని, కానీ తనకు నిజమైన సంతృప్తిని ఇచ్చేది మాత్రం దర్శకనిర్మాతల నుండి వచ్చే మెప్పు మాత్రమేనని పరేశ్ రావల్ స్పష్టం చేశారు. తమ కష్టాన్ని గుర్తించి, మెచ్చుకునే ఆ కొంతమంది గౌరవనీయ వ్యక్తుల ప్రశంసలే తనకు అతిపెద్ద బహుమతులని ఆయన తెలిపారు.
విభిన్న పాత్రలతో సినీ ప్రేక్షకులను అలరించిన పరేశ్ రావల్, 1994లో ‘వో ఛోకరీ’, ‘సర్’ సినిమాల్లో ఉత్తమ నటనకు గాను ఉత్తమ సహాయనటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. సుదీర్ఘ అనుభవం ఉన్న ఈ నటుడు చేసిన ఈ వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
