Pawan Kalyan : రాప్తాడులో జర్నలిస్ట్ దాడి ఘటనపై జనసేనాని ఫైర్.. జగన్ పాలనంతా హింసే
రాప్తాడులో సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్వహించిన సిద్ధం సభ హింసాత్మకంగా మారింది. సభలో వైసిపి శ్రేణులు ఫోటో జర్నలిస్ట్ శ్రీకృష్ణపై దాడి చేసి తీవ్రంగా గాయపడేలా చేశారు. తన ఉద్యోగం రీత్యా విధులు నిర్వహిస్తున్న శ్రీకృష్ణపై వైసీపీ మూకలు ఈ రకమైన దాడికి పాల్పడ్డారు. రాష్ట్రం మొత్తం ఈ సంఘటనని తీవ్రంగా విమర్శిస్తున్నారు.
స్వయంగా ముఖ్యమంత్రి సభలోనే జర్నలిస్టులకు భద్రత లేదని దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ సంఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి నేతలు.. ఆ పార్టీ చేస్తున్న హింసాత్మక సంఘటనలు రోజు రోజుకి ఎక్కువవుతున్నాయి అని పవన్ కళ్యాణ్ అన్నారు. రాప్తాడులో జర్నలిస్ట్ శ్రీకృష్ణపై చేసిన దాడిని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
జర్నలిస్ట్ పై అంత దాడి జరుగుతున్నా పోలీసులు కనీసం అడ్డుకోకపోవడం దురదృష్టకరం అని పవన్ అన్నారు. పోలీస్ శాఖ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఈ సంఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా వైసీపీ జగన్ పాలనలో గతంలో జరిగిన జర్నలిస్టు దాడుల్ని కూడా పవన్ గుర్తు చేశారు. గుంటూరు జిల్లా పెదకూరపాడులో ఇసుక మాఫియా గురించి వార్త రాసేందుకు వెళ్లిన జర్నలిస్ట్ పై వైసీపీ మూకలు దాడి చేశాయి. వైసిపి ప్రభుత్వం వచ్చిన కొన్ని నెలలకే తునిలో ఓ విలేఖరిని హత్య చేశారు. వైసీపీ ప్రభుత్వంలో మీడియా యజమానులపై ఆంక్షలు విధించేలా జీవోలు తీసుకువచ్చారు. వైసీపీ హింసాత్మక వైఖరిని ప్రజాస్వామ్య వాదులంతా ఖండించాలి అని పవన్ కోరారు.
