Pawan Kalyan about Heavy Rains : రెండు తెలుగు రాష్ట్రాలలో వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న విషయం విధితమే. ఈ వర్షాలకు ఎంతోమంది ప్రజలు తీవ ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్లు తెగిపోయి,మత్తడి పోస్తూ ఎన్నో వాగులు పొంగిపొర్లుతున్నాయి. చాలామంది గూడు కోల్పోయి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వరదల్లో చాలా కుటుంబాలు చిక్కుకున్నాయి. ఒకవైపు ఆహారం అందక, మరోవైపు నిలువ నీడ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
అందులో భాగంగానే ఎన్నో గ్రామాలు నీటమునిగాయి. సహాయ, సహకారాలు అందక వాళ్లు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు ఇంకో మూడు రోజులు ఉన్న కారణంగా ప్రజలు తీవ్రంగా భయాందోళనకు గురవుతున్నారు. ఎవరైనా వచ్చి మమ్మల్ని ఆదుకోవాలని వారు ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ విషయాలపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ..

తెలంగాణ రాష్ట్రంలో ఎడతెగని భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షాలకు తోడు వరద ప్రభావం కూడా భూపాలపల్లి జిల్లాలో పలు గ్రామాలను జల దిగ్బందం చేసింది. ఈ రోజు ఉదయం భూపాలపల్లి జిల్లా, మోరంచపల్లి గ్రామం వరదలో చిక్కుకున్న విషయం నా దృష్టికి వచ్చింది. దాదాపు 200 కుటుంబాలు సాయం కోసం ఎదురుచూస్తున్నాయి.
అలాగే ములుగు జిల్లాలోని ముత్యాలధార జలపాతం వద్దకు వెళ్ళిన 40 మంది పర్యాటకులు అక్కడే చిక్కుకుపోయిన విషయం ఆందోళన కలిగిస్తుంది అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం, విపత్తు నిర్వహణ బృందాలు సత్వరమే బాధిత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు చేయాలి. మరో పక్క నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్ట్ గరిష్ట స్థాయి దాటి నీరు ఉప్పొంగడం ప్రమాద తీవ్రతను తెలియజేస్తుంది.
తెలంగాణ ప్రభుత్వం వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించాలని, ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ప్రజలను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాను అని పవన్ అన్నారు. జనసేన నాయకులు, శ్రేణులు బాధిత ప్రజలకు అవసరమైన సహాయక చర్యల్లో పాలుపంచుకోవాలి అని పవన్ సూచించారు.
