Pawan Kalyan: పవన్ కోసం దిల్ రాజు మాస్టర్ ప్లాన్.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగా కాంబో ఫిక్స్?
Pawan Kalyan: టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ తదుపరి చిత్రం గురించి ఫిల్మ్ సర్కిల్స్‌లో ఓ ఆసక్తికరమైన వార్త బలంగా చక్కర్లు కొడుతోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో, మాస్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో పవన్ కల్యాణ్ ఒక సినిమా చేయబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వార్తకు, ఇటీవల జరిగిన ఓ వేదికపై దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు మరింత బలాన్ని చేకూర్చాయి.
రీసెంట్‌గా పవన్ కల్యాణ్ నటించిన ‘ఓజీ’ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్న దిల్ రాజు, త్వరలోనే పవన్ కల్యాణ్‌తో సినిమా చేస్తానని బహిరంగంగా ప్రకటించారు. “పవన్ కల్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ, ఆయనను రిక్వెస్ట్ చేసైనా డేట్స్ తీసుకుంటాను” అని ఆయన ఆనాడు సభాముఖంగా చెప్పడం జరిగింది. దిల్ రాజు ఆ మాట అన్న కొద్ది రోజులకే ఇప్పుడు వినిపిస్తున్న ఈ కాంబినేషన్ వార్త సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.
ఇక ఈ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహించే అవకాశం అనిల్ రావిపూడికి దక్కనున్నట్లు తెలుస్తోంది. అనిల్ రావిపూడి తన కెరీర్‌లో అత్యధిక సినిమాలను దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లోనే చేశారు. ఈ ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. అంతేకాకుండా, ఏ స్టార్ హీరోకైనా వారి ఇమేజ్‌కి తగ్గట్టుగా కథను సెట్ చేసి, మాస్ ఎలివేషన్స్‌తో సూపర్ హిట్లు కొట్టడంలో అనిల్ రావిపూడికి మంచి అనుభవం ఉంది. అందుకే, పవన్ లాంటి స్టార్‌తో తాను చేయబోయే సినిమాకు అనిల్‌ని దర్శకుడిగా దిల్ రాజు ఫైనల్ చేసినట్లు సమాచారం.
ప్రస్తుతం అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో కలిసి ‘మన శంకరవరప్రసాద్‌గారు’ అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. మరోవైపు, పవన్ కల్యాణ్ కూడా హరీష్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ చిత్రాన్ని దాదాపు పూర్తి చేసే దశలో ఉన్నారు. ఈ సినిమాలు పూర్తయిన వెంటనే, పవన్-అనిల్ రావిపూడి కాంబో ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అయితే, ఈ బిగ్ కాంబో వార్తలో నిజమెంత ఉందో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు.
