Pawan Kalyan – Beemiley : అధికార పార్టీ విధ్వంసానికి అంతరించిపోతున్న భీమిలి ఎర్రమట్టి దిబ్బల పరిశీలనకు వెళ్లిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి విశాఖ తూర్పు, భీమిలి నియోజకవర్గాల ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. మత్స్యకార యువత, మహిళలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చి హారతులు పెట్టారు. ప్రతి అడుగున పూల వర్షం. జన సైనికుల కేరింతల మధ్య సాగింది. మంగళగిరి కేంద్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని బుధవారం మధ్యాహ్నానికి విశాఖ చేరుకున్నారు.
పార్టీ నాయకుల స్వాగత సందోహాల మధ్య అక్కడి నుంచి విశాఖ తూర్పు నియోజకవర్గం మీదుగా భీమిలి బయలుదేరారు. సాగర్ నగర్, రామాద్రి నగర్, నరసింహనగర్ తదితర ప్రాంతాల్లో జనసేన శ్రేణులతో పాటు ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్ల మీదకు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి జేజేలు పలికారు. సంప్రదాయ డప్పు శబ్దాలు, వందలాది ర్యాలీ మధ్య సుమారు రెండు గంటల పాటు రోడ్ షో నిర్వహించారు.
పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలికేందుకు వచ్చిన యువత, మహిళలు ఆయన్ని తమ సెల్ ఫోన్ కెమెరాల్లో ఫోటోలు, వీడియోల రూపంలో బంధించేందుకు పోటీ పడ్డారు. పవన్ కళ్యాణ్ గారు చాలా చోట్ల జన సైనికులు, వీర మహిళల నుంచి మొబైల్స్ తీసుకుని వారితో సెల్ఫీలు దిగి ఉత్సాహపరిచారు. తన కోసం వచ్చిన ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. భీమిలి నియోజకవర్గంలోకి ప్రవేశించిన ఆయనకు మత్స్యకార మహిళలు, యువత పెద్ద ఎత్తున రోడ్డు మీదకు వచ్చి ఆహ్వానించారు. ప్రకృతి విధ్వంసం నుంచి తమను కాపాడాలంటూ వేడుకున్నారు.
ముఖ్యంగా దివీస్ పరిశ్రమ వెదజల్లే రసాయన వ్యర్ధాల వల్ల సముద్రంలో మత్స్య సంపద అంతరించిపోతుందన్న విషయాన్ని మత్స్యకారులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువచ్చారు. మత్స్య సంపద అంతరించి తమ జీవనం దుర్భరంగా మారిపోతోందని, రసాయన వ్యర్ధాలను దివీస్ శుద్ది చేయకుండా నేరుగా సముద్ర గర్భంలో కలిపేస్తోందని, కాలుష్యం కాటు నుంచి కాపాడాలని పవన్ కళ్యాణ్ గారిని కోరారు. ఈ అంశం మీద గళం విప్పుతానని మత్స్యకారులకు మాటిచ్చారు.
ఎర్రమట్టి దిబ్బల్లో సాగుతున్న ప్రకృతి విధ్వంసాన్ని పవన్ కళ్యాణ్ గారు చెప్పులు విడిచి కాలి నడకన తిరుగుతూ స్వయంగా పరిశీలించారు. కిలోమీటరు పైగా దూరం ఎర్రమట్టి దిబ్బల మీదుగా నిర్మిస్తున్న రోడ్లు, తవ్వేసిన ప్రాంతాలను కాలినడక ద్వారానే పరిశీలించారు. తర్వాత వ్యూ పాయింట్ టవర్ ఎక్కి ఎర్రమట్టి దిబ్బలను తిలకించారు. భీమిలీ ఇంచార్జ్ పై సందీప్ పంచకర్ల ఎర్రమట్టి దిబ్బల్లో విధ్వంసం సాగుతున్న తీరుని వివరించారు. పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారితోపాటు విశాఖ జిల్లాకు చెందిన పార్టీ నాయకులు ఎర్రమట్టి దిబ్బలను సందర్శించిన వారిలో ఉన్నారు.