Pawan Kalyan – Central Cabinet : చట్టసభల్లో మహిళామణుల ప్రాతినిధ్యం పెంచాలనే వనితా లోకం ఆకాంక్షలు నెరవేరే రోజులు సమీపంలోనే ఉన్నాయి. ఇందుకు అవసరమైన మహిళా రిజర్వేషన్ బిల్లుకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం, ప్రస్తుతం నడుస్తున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకోవడం హర్షణీయం.
చారిత్రాత్మకమైన ఈ బిల్లు కేబినెట్ సమావేశంలో ఆమోదం పొందేలా కృషి చేసిన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను. చట్ట సభల్లో 33శాతం స్థానాలు మహిళలకు దక్కేలా చేసి ఈ బిల్లు విషయమై వాగ్దానాలు, నినాదాలకు పరిమితం కాకుండా కార్యరూపం దాల్చేలా చేయడంలో మోదీ గారు ఎంతో చిత్తశుద్ధి చూపారు.

ఈ బిల్లు చట్టసభల్లోనూ ఆమోదం పొందితే కచ్చితంగా రాజకీయంగా మహిళా సాధికారత సాధ్యమవుతుంది. సంక్షేమం, అభివృద్ధితోపాటు మహిళా రక్షణ, విద్య, వైద్యం లాంటి అంశాల్లో మహిళా ప్రతినిధులు విలువైన చర్చలు చేయగలరు. కావున ఈ బిల్లును చట్ట సభల సభ్యులు ఏకాభిప్రాయంతో ఆమోదిస్తారని ఆశిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ తెలిపారు.
