Pawan Kalyan: లెజెండరీ నిర్మాత ఏవీఎం శరవణన్ మృతి: పవన్ కల్యాణ్ సంతాపం..
Pawan Kalyan: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సుదీర్ఘ చరిత్ర కలిగిన ఏవీఎం స్టూడియోస్ అధినేత, ప్రముఖ నిర్మాత శ్రీ ఎ.వి.ఎమ్. శరవణన్ గారి మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. శరవణన్ గారు ఇక లేరనే వార్త విని తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
పవన్ కల్యాణ్ X వేదికగా ద్వారా స్పందిస్తూ, శ్రీ ఎ.వి.ఎమ్. శరవణన్ గారు ఏవీఎం సంస్థను అత్యంత సమర్థవంతంగా ముందుకు నడిపారని, సినీ పరిశ్రమ అభివృద్ధికి ఆయన అందించిన సేవలు ఎనలేనివని కొనియాడారు. కేవలం నిర్మాతగానే కాకుండా, ఎప్పుడూ వైవిధ్యమైన, సామాజిక విలువలున్న కథలను ఎంచుకోవడంలో ఆయనకు ప్రత్యేకమైన దృష్టి ఉండేదని పవన్ కల్యాణ్ గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా కుటుంబమంతా కలిసి చూసేలా ఉండే విలువలతో కూడిన చిత్రాలను ఆయన నిర్మించడం, నేటి తరానికి ఆదర్శమని తెలిపారు.
ఈ సందర్భంగా ఏవీఎం ప్రొడక్షన్స్ నిర్మించిన కొన్ని మైలురాళ్ల లాంటి విజయవంతమైన చిత్రాలను పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. మెగాస్టార్ చిరంజీవి గారితో ఏవీఎం సంస్థ నిర్మించిన క్లాసిక్ చిత్రం ‘పున్నమినాగు’ ఇప్పటికీ తరాల అంతరం లేకుండా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోందని పేర్కొన్నారు.
అంతేకాకుండా ‘సంసారం ఒక చదరంగం’, ‘ఆ ఒక్కటీ అడక్కు’, ‘లీడర్’, ‘మెరుపు కలలు’, అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్‌తో నిర్మించిన ‘శివాజీ’ వంటి ఎన్నో అద్భుతమైన, విజయవంతమైన చిత్రాలను తెలుగు మరియు తమిళ ప్రేక్షకులకు అందించిన ఘనత శ్రీ శరవణన్ గారిదని పవన్ కల్యాణ్ తెలిపారు. ఆయన మరణం భారతీయ సినిమాకు తీరని లోటని ఆయన పేర్కొన్నారు. దశాబ్దాల పాటు తన ప్రొడక్షన్ హౌస్‌తో సినీ చరిత్రలో చెరగని ముద్ర వేసిన శరవణన్ గారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
