Pawan Kalyan: బాలయ్య అరుదైన వరల్డ్ రికార్డు.. పవన్ కళ్యాణ్ అభినందనలు
Pawan Kalyan: తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. సుదీర్ఘ నట జీవితం, ప్రజలకు ఆయన అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (లండన్)’లో ఆయన పేరు నమోదైంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బాలకృష్ణకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పవన్ ఈ శుభాకాంక్షలు తెలియజేయడం విశేషం.
‘నందమూరి తారక రామారావు గారి నటవారసుడిగా చిన్న వయసులోనే వెండితెరపై అడుగుపెట్టి, ఎన్నో జానపద, పౌరాణిక, యాక్షన్, కుటుంబ కథా చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారు. గత 50 ఏళ్లుగా ఆయన సినీ ప్రయాణం అద్వితీయమైనది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించడం ఆయన కృషికి, ప్రతిభకు దక్కిన నిజమైన గౌరవం,’ అని పవన్ కళ్యాణ్ తన పోస్టులో పేర్కొన్నారు.
నటనలోనే కాకుండా, సమాజ సేవలోనూ బాలకృష్ణ తనదైన ముద్ర వేశారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్‌గా పేదలకు తక్కువ ఖర్చుతోనే మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఒకప్పుడు క్యాన్సర్ చికిత్స కోసం చెన్నై వంటి నగరాలకు వెళ్లాల్సిన అవసరం ఉండేది. కానీ, బాలయ్య స్థాపించిన ఆసుపత్రి ఎంతోమందికి ఆశాదీపంగా మారింది. ఆయన ప్రజాసేవను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆయనను పద్మ భూషణ్ పురస్కారంతో సత్కరించింది.
బాలకృష్ణ సినిమాల విషయానికొస్తే, ఆయన నటించిన 100కు పైగా చిత్రాల్లో 75కు పైగా చిత్రాలు శత దినోత్సవాలు జరుపుకోవడం ఒక అరుదైన రికార్డు. ముఖ్యంగా, ‘అఖండ’ నుంచి ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’, ‘డాకు మహారాజ్’ వంటి వరుసగా నాలుగు చిత్రాలు సిల్వర్ జూబ్లీ జరుపుకోవడం కూడా ఒక గొప్ప విశేషం. ఈ రికార్డులన్నీ ఆయన ఖాతాలో చేరాయి. అంతేకాకుండా, రాజకీయాల్లోనూ హిందూపురం ఎమ్మెల్యేగా వరుసగా మూడు సార్లు విజయం సాధించారు.
బాలకృష్ణ భవిష్యత్తులో కూడా తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ, ప్రజలకు సేవలు అందిస్తూ ముందుకు సాగాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. బాలయ్య సాధించిన ఈ విజయానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే శుభాకాంక్షలు తెలిపారు.