Pawan Kalyan in Telangana Election Campaign : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బిజెపితో పొత్తు పెట్టుకున్న విషయం మనకు తెలిసిందే. కానీ ఇప్పటివరకు ఆయన తెలంగాణ ఎన్నికలకు సంబంధించి ఎటువంటి ప్రచారంలో పాల్గొనలేదు. ఈ విషయంలో చాలా అసంతృప్తి నెలకొంది. ఒకపక్క ప్రధాని నరేంద్ర మోడీ ప్రచారాన్ని చేస్తున్న నేపథ్యంలో, పొత్తు పెట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ విషయంలో స్పందించకపోవడంతో బిజెపి పార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని సమాచారం.
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తన మనసు మార్చుకొని తెలంగాణలో ఎలక్షన్స్ కోసం ప్రచారం చేయడానికి ఒప్పుకున్నారని తెలుస్తుంది. ఈ లెక్క ప్రకారం బిజెపి అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్ తెలంగాణ రానున్నారంట. బిజెపి అభ్యర్థులకు తన మద్దతు తెలుపుతూ ప్రచారం చేస్తూనే, మరోపక్క జనసేన అభ్యర్థులకు కూడా తన మద్దతు తెలుపుతూ ప్రచారం చేయడానికి పవన్ సన్నిద్ధమవుతున్నారని తెలుస్తుంది.
ఈ ప్రచారానికి గాను పవన్ కళ్యాణ్ ఇప్పటికే రూట్ మ్యాప్ ని కూడా సిద్ధం చేసుకున్నారని సమాచారం. ఆయన రోడ్ షోలలో పాల్గొని తమ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరనున్నారు. ఈనెల 22న పవన్ కళ్యాణ్ హనుమకొండలో బిజెపి పార్టీ వరంగల్ పశ్చిమ అభ్యర్థి రావు పద్మకు మద్దతునిస్తూ పవన్ ప్రచారం చేయనున్నారు. రావు పద్మకు ఓట్లు వేసి గెలిపించాలి అని ప్రజలను పవన్ కళ్యాణ్ అభ్యర్థించనున్నారు.
దాంతో పాటు ఈనెల 25న తాండూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థి ఎన్ శంకర్ గౌడ్ కు మద్దతుగా పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 26 వ తేదీన కూకట్ పల్లి నియోజకవర్గం బిజెపి జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీచేస్తున్న మమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ కు మద్దతుగా పవన్ సభలో పాల్గొననున్నారు.
ఈ సభకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కూడా హాజరవ్వడం గమనార్హం. ఇప్పటివరకు తన మీద వస్తున్న విమర్శలను పవన్ కళ్యాణ్ చెక్ పెట్టనున్నారు. ప్రచారం చేయడానికి తెలంగాణకు వస్తున్నారు. అదేవిధంగా బిజెపి పెద్దల దృష్టిలో పడడానికి కూడా పవన్ ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది.