Pawan Kalyan in the Gulf Country : శనివారం ఉదయం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎస్ఆర్ఎస్ఐ గల్ఫ్ విభాగం సభ్యులతో పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. కరడుగట్టిన, కఠిన చట్టాలు ఉండే గల్ఫ్ దేశాలకు వెళ్లి బతకగలం.. మన దేశంలో మాత్రం బతకడానికి ఇబ్బందిపడే పరిస్థితి మన రాష్ట్రంలో నెలకొంది. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అనేది లేదు.. అన్యాయం జరిగితే ఎవరికి చెప్పుకోవాలో తెలియదు..
ఇలాంటి పరిస్థితుల మధ్య రూల్స్ పాటిస్తూ అన్యాయం జరుగుతున్నప్పుడు బలంగా ఎదిరించే బలమైన రాజకీయ వ్యవస్థను తీసుకురావాలన్న లక్ష్యంతోనే ముందుకు వెళ్తున్నామని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో దౌర్జన్యం, రౌడీయిజం చేయగలిగిన వాడే రాజకీయ నాయకుడు అన్నట్టు పరిస్థితి తయారైంది. కుల దూషణలు చేసే వారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వారే రాజకీయ నాయకులుగా ఉన్నారు.
ఇలాంటి పరిస్థితులన్నింటినీ అధిగమించి ఒక తరం కోసం నా ఆఖరి శ్వాస వరకు నా నేల కోసం పని చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. గల్ఫ్ దేశాలకు చెందిన ఎస్ఆర్ఎస్ఐ జన సైనికులు పార్టీకి రూ.కోటి విరాళం అందచేశారు, కౌలు రైతు భరోసా యాత్ర నిమిత్తం మరో రూ.లక్షా 10 వేల చెక్కును పవన్ కళ్యాణ్ గారికి అందచేశారు, ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ జనసేనకు ఎస్ఆర్ఎస్ఐ విభాగం మద్దతు అవసరం.
మీరిచ్చే మద్దతును బాధ్యత, జవాబుదారీతనంతో ముందుకు తీసుకువెళ్తాం. ఎక్కడో గల్ఫ్ దేశాలకు వెళ్లి మీరు ప్రశాంతంగా బతకగలుగుతున్నారు. ఇక్కడ ఆ పరిస్థితులు లేవు. రాజంపేట నియోజకవర్గం, సుండుపల్లికి చెందిన శ్రీ లక్ష్మీనారాయణ గారు సర్పంచ్ అభ్యర్ధిగా బరిలోకి దిగినందుకు ఆయనకున్న 3 ఎకరాల 20 సెంట్ల భూమిని బలవంతంగా లాగేసుకున్నారు. మన దేశంలో బతకడానికి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. ఇక్కడ అన్యాయం జరిగితే ఎవరికి చెప్పుకోవాలో తెలియని దుస్ధితి. చెప్పుకోవాలంటే తెలిసిన పోలీసు అధికారి అయినా ఉండాలి.. లేదా ఎమ్మెల్యే సొంత కులపొడు అయినా ఉండాలి అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు..