Pawan Kalyan in Visakha : గురువారం సాయంత్రం మంగలగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విశాఖ జిల్లా నాయకులు, వారాహి యాత్ర కమిటీల సభ్యులతో పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. ఈ నెల 10వ తేది నుంచి విశాఖ నగరంలో ప్రారంభం కానున్న వారాహి విజయ యాత్ర గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడో విడత వారాహీ విజయ యాత్ర పూర్తయ్యే లోపు విశాఖలో భూ కబ్జాలు ఆగాలి. ఉత్తరాంధ్ర వనరులు దోచె వారిని నిలువరించాలి.
పారిశ్రామిక కాలుష్య నియంత్రం అనే అంశం మీద స్పష్టత రావాలి’ అని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. ఈసారి వారాహి యాత్ర గురించి దేశం మొత్తం మాట్లాడుకోవాలి… జాతీయ మీడియా సైతం దృష్టి సారించేలా చేద్దామన్నారు. ఉత్తరాంధ్రలో జరుగుతున్న వనరుల దోపిడీ దేశం మొత్తం తెలియాలన్నారు. వారాహి విజయ యాత్రలో భాగంగా మంత్రులు, వైసీపీ నేతల కనుసన్నల్లో కబ్జాకు గురైన భూములు.. కరిగిపోతున్న ఎర్రమట్టి దిబ్బలను ఖచ్చితంగా పరిశీలిస్తామని తెలిపారు.
ఇక్కడ జరుగుతున్న దోపిడీ దేశం అంతటికి తెలిసేలా చేస్తామన్నారు. గతంలో శ్రీకాకుళం జిల్లాలో పోరాట యాత్ర ప్రారంభించినప్పుడు చాలా క్లిష్ట పరిస్థితులు ఉన్నాయి. బ్యాంకులో రూ. 15 లక్షలు కూడా లేని పరిస్థితుల్లో మావాళ్లు ముందుకు వెళ్లడం ఎలా సాధ్యం అని సందేహించారు. ఆ రోజు దైర్యంగా వేసిన ముందడుగే ఈ రోజు ఇక్కడ వరకు తీసుకువచ్చింది. డబ్బుతో కాకుండా ఒక భావం మనందరినీ కలిపింది అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేసారు.