Pawan Kalyan – Independence Day : 77 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలో జనసేన వీర మహిళలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఆయన మహిళల గురించి మాట్లాడుతూ.. మహిళలు ఆర్ధికంగా, సామాజికంగానే కాదు. రాజకీయంగా కూడా సర్వసత్తాకులుగా ఎదగాలి. దీనికి జనసేన కట్టుబడి ఉంది. -మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే ఆలోచన జనసేన చేస్తుంది. అలాగే వారి మాన, ప్రాణ రక్షణకు, భద్రతకు జనసేన పెద్దపీట వేస్తుంది. రాజ్యాధికారంలోనూ మహిళలకు మూడో వంతు భాగం ఉండాలి.
గొప్పగా పోరాడే శక్తి ఉన్నవారు మహిళలే. మీ పిల్లలకు ధైర్యం నేర్పించాల్సింది స్త్రీమూర్తులే. నా తల్లి నాలో ఇంతటి ధైర్యం నేర్పింది కనుకే మీ కోసం పోరాడేందుకు నేను ఇక్కడ ఉన్నాను. సమాజంలో జరిగే ప్రతి అన్యాయం, అక్రమం మీద బిడ్డలకు పోరాడే శక్తినివ్వండి. సమాజంలో జరిగే అన్యాయం రేపు మన వరకు రాదు అనే గ్యారెంటీ లేదు. రాజ్యాంగం మనకు బతికే హక్కు… పనిచేసుకునే హక్కును కల్పించింది. సమాజంలో మహిళలను ఇంకా తక్కువ స్థాయిలో చూసే విధానం, వారిపై జరుగుతున్న ఆకృత్యాలను జనసేన పూర్తిగా ఖండిస్తుంది అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
ఇటీవల మణిపూర్ లో ఓ మహిళను నగ్నంగా నిలబెట్టిన సంఘటనే కాదు.. రాష్ట్రంలో ఓ మహిళపై వైసీపీ గుండాలు చేసిన దాడి సైతం అత్యంత హేయం. మహిళలపై ఎక్కడ దాడి జరిగినా, అన్యాయం జరిగినా జనసేన ఖచ్చితంగా ఖండిస్తుంది. రాజ్యంగ స్వాతంత్ర్య పోరాటంలో ఎందరో మహిళల త్యాగాలు ఉన్నాయి. సమాజంలో బలమైన మార్పు తీసుకొని రాగల ధైర్యం మహిళలకు మాత్రమే ఉంది. ఆ బాధ్యతను రాష్ట్రంలోని మహిళా మూర్తులంతా తీసుకోవాలి అని పవన్ కళ్యాణ్ తెలిపారు.