Pawan Kalyan – Jagan : మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ విస్తృత సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో చాలా గొడవలు జరుగుతాయి. జగన్ అనే వ్యక్తి తన దగ్గరున్న అధికారం అనే దండాన్ని వేరేవాళ్లకి ఇవ్వడానికి ఏ మాత్రం ఇష్టపడే వ్యక్తి కాదు. తన రాజకీయ ఆధిపత్యం వదులుకునే వ్యక్తి అస్సలు కాదు.. జనసేన ప్రజా బలంతోనే ఆ అధికారాన్ని చేజిక్కించుకోవాలి. రాష్ట్రం బాగు కోసం జగన్ నుంచి అధికారాన్ని తప్పించాల్సిన అవసరం ఉంది.
ఎన్నికలకు సమయం దగ్గర పడింది. ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే ముందస్తు ఎన్నికలు తద్యంగా కనిపిస్తున్నాయని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది. నాయకుడిగా నా వంతు ప్రయత్నాన్ని త్రికరణ శుద్ధితో చేసుకుంటూ వెళ్తాను. ప్రకృతి వనరులు అనేవి ఏ ఒక్కరి పొత్తు కాదు. జగన్, అతని అనుచరుల సొంత ఆస్తులు అంతకంటే కాదు. రాజ్యాంగం ప్రకృతి వనరుల మీద అందరికీ సమాన హక్కులు ఇచ్చింది.
జీవించే హక్కు ఇచ్చింది. నేను జగన్ లాంటి వ్యక్తికి భయపడేవాడిని కాదు. భయపడితే ఇంకా భయపడతారు. ఖచ్చితంగా ఈ ప్రయాణంలో సమష్టిగా ఒక గొప్ప మార్పు కోసం ప్రయాణం చేద్దాం, పరాజయం తాలుకా నిశబ్దాన్ని ఇప్పటి వరకు భరించాం. ఆశయం కోసం పనిచేసి ఓడిపోవడం బాధ కలిగించినా సమాజం మీద బాధ్యతతో నిలబడి ఉన్నాం. ఇక నుంచి మంగళగిరి మన నివాస స్థానం, ఆంధ్రప్రదేశ్ నుంచే పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేస్తాడు. దీనిని మీరు కూడా ప్రజలకు బలంగా చెప్పండి అన్ని స్పష్టం చేశారు.
జగన్ వచ్చాక దోపిడీ విశ్వ రూపం రాజకీయాల్లోకి ఎవరూ రాకూడదు. సామాన్యుడు అసలు రాజకీయం చేయకూడదు అనే పరిస్థితి ఎప్పటి నుండో ఉంది. రాజకీయాల్లో బెదిరింపులు, దోపిడీలు, అవినీతి, అక్రమాలు ఇవన్నీ చూసి సామాన్యుడు మనకు రాజకీయం ఎందుకులే అనుకునేవాడు. జగన్ అధికారంలోకి వచ్చాక ఇది మరింతగా విశ్వ రూపం దాల్చింది. అడిగితే కేసులు, ప్రశ్నిస్తే హత్యలు, ఎదిరిస్తే మనిషిని కనిపించకుండా చేయడం చేస్తున్నారు.
కనీసం సామాన్యుడు సాధారణంగా బతకడానికి కూడా భయపడే పరిస్థితులు తెచ్చారు. జరుగుతున్న పరిణామాలు నాకేం సంబంధం అని సామాన్యుడు అనుకుంటే అప్పటి నుంచే సమాజ నాశనం ప్రారంభం అవుతుంది. సమష్టిగా అందరూ ఒక్కటై రాజ్యాంగ హక్కులను బతికించుకోవడానికి పోరాడదాం అని పవన్ వెల్లడించారు.