Pawan Kalyan – Modi : భారతదేశానికి స్ఫూర్తివంతమైన నాయకత్వాన్ని అందిస్తున్న గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తూ, ప్రపంచం నలుమూలలా భారతీయతను పరిమళించేలా అవిరళ కృషి చేస్తున్న నరేంద్ర మోదీ గారి రాజనీతిజ్ఞత చైతన్యవంతమైనది. అనుసరణీయమైనది. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్న నానుడి ఆయన క్రియాశీల రాజకీయ జీవితం తార్కాణంగా నిలుస్తుంది.
జి-20 శిఖరాగ్ర సదస్సు ప్రజలు మెచ్చేలా, విదేశీ నాయకులు మనసు దోచేలా నిర్వహించిన తీరు ప్రశంసనీయం. కాశ్మీర్ లో శాంతి స్థాపన, మేక్ ఇన్ ఇండియా, దేశ రక్షణలో స్వావలంబన, పారిశ్రామిక ప్రగతి, ప్రపంచ దేశాలతో సుహృద్భావ స్నేహ సంబంధాలు, విద్య-వైద్యం, మానవ వనరుల పురోభివృద్ధి, చంద్రయాన్-3, ఆదిత్య ఎల్ -1 ప్రయోగాలతోపాటు అంతరిక్ష రంగాన సాధిస్తున్న విజయాలు మోదీ గారి నాయకత్వ పటిమకు మచ్చుతునకలు. అన్నిటికన్నా మిన్న విజన్-2047 ప్రణాళిక. ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్న భారతదేశాన్ని 2047 నాటికి ప్రపంచంలో అగ్రగామి దేశంగా.. అంటే సంపూర్ణమైన అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ను తీర్చిదిద్దాలన్న ఆయన సంకల్పం అద్వితీయమైనది.

భారత్ కు స్వాతంత్రం సిద్దించి వందేళ్లు పూర్తయ్యేనాటికి ఈ దార్శనికత పరిపూర్ణమై సాకారం కావడం భారతీయులందరూ గర్వించే ఒక విశిష్ట ఆవిష్కారమవుతుంది. దేశ చరిత్రలో ఇదో గొప్ప మేలిమలుపుగా భావిస్తున్నాను. నిస్వార్ధంగా, సంకుచిత భావాలకు అతీతంగా మోదీ గారు అందిస్తున్న పరిపాలన ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రజలకు చిరంతనంగా సేవలందించడానికి ఆయనకు చక్కటి ఆరోగ్యం, చిరాయువును ప్రసాదించాలని నా పక్షాన జనసేన శ్రేణుల పక్షాన భగవంతుణ్ణి కోరుకుంటున్నాను అని పవన్ కళ్యాణ్ తెలిపారు.
