OG Movie: ‘ఓజీ’ క్రేజ్ మామూలుగా లేదుగా.. రిలీజ్‌కు ముందే రికార్డుల మోత
OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా ఓజీ (OG). యువ దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా విడుదల కాకముందే రికార్డులు సృష్టిస్తోంది. ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్‌లు భారీగా జరుగుతున్నాయి. ఫస్ట్ సింగిల్ హీరో నల్లగా ఉంటే విడుదలైనప్పటి నుంచి ఓజీపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ఇప్పుడు ఓజీ ఫీవర్ దేశవ్యాప్తంగానే కాదు, విదేశాల్లోనూ కనిపిస్తోంది.
పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో అడ్వాన్స్ బుకింగ్‌ల ద్వారా మరోసారి రుజువయ్యింది. ముఖ్యంగా ఉత్తర అమెరికాలో ఈ సినిమా రికార్డు స్థాయి వసూళ్లను సాధిస్తోంది. రిలీజ్‌కు ఇంకా రెండు వారాల సమయం ఉన్నప్పటికీ, ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్‌ల ద్వారా $1.25 మిలియన్ డాలర్లు వసూలు చేసినట్లు అధికారికంగా ప్రకటించారు.
ఇప్పటికే ఉత్తర అమెరికాలో 45,000కు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ గణాంకాలు ఓజీ సినిమాపై ఉన్న క్రేజ్‌కు నిదర్శనం. గతంలో పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది లాంటి సినిమాలకు కూడా ఈ స్థాయిలో ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ జరగలేదు. అయితే ఈ సినిమాకు అది మరింత ఎక్కువగా ఉంది. ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో కనిపించనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు.
కాగా.. ‘ఓజీ’కి తమన్ అందిస్తున్న బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కోసం లండన్‌లోని ప్రఖ్యాత స్టూడియోలో రికార్డింగ్ పనులు జరుగుతున్నాయని తమన్ ప్రకటించారు. ఈ పోస్ట్ అభిమానులందరిలో ఉత్సాహాన్ని నింపింది. ఈ బీజీఎంలో ఏకంగా 117 మంది సంగీత కళాకారులు పాల్గొంటున్నారని, వారితో కలిసి ఈ ప్రాజెక్టుపై పనిచేయడం అద్భుతంగా ఉందని తమన్ పేర్కొన్నారు. ఈ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా గొప్పగా వచ్చిందని, అభిమానులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తమన్ పోస్ట్‌తో #HungryCheetah అనే హ్యాష్‌ట్యాగ్ మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చింది. ఈ సినిమా కోసం ఇప్పటికే జపాన్ వాయిద్య పరికరం ‘కోటో’ను ఉపయోగించినట్లు గతంలో తమన్ వెల్లడించిన విషయం తెలిసిందే.