OG Movie: ‘ఓజీ’ పండగకు రంగం సిద్ధం.. అంచనాలు భారీగా పెంచిన ఆ ఐదు.. ఏంటంటే?
OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఓజీ’ సినిమా విడుదలకు సర్వం సిద్ధమైంది. నేడు (బుధవారం) రాత్రే పలుచోట్ల ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి. గతంలో ఏ సినిమాకు లేనంత హైప్ ‘ఓజీ’కి ఏర్పడింది. పూరీ జగన్నాథ్ సరదాగా చెప్పినట్లు, ‘గన్ డీలర్’ కథతో పవన్‌ను మెప్పించిన దర్శకుడు సుజీత్, అభిమానుల అంచనాలను అందుకుంటారా? ఈ సినిమాకు అదనపు బలాన్ని ఇస్తున్న ఐదు అంశాలు ఏమిటో చూద్దాం.
1. పవన్ వన్ మ్యాన్ ఆర్మీ
‘అత్తారింటికి దారేది’ తర్వాత పవన్‌ను పూర్తి యాక్షన్, స్టైలిష్ అవతార్‌లో చూడాలని అభిమానులు ఆశపడుతున్నారు. ‘ఓజీ’ ట్రైలర్ చూస్తే, వారి కోరిక నెరవేరుతుందని స్పష్టమవుతోంది. కటనా కత్తి, నాన్‌చాక్, గన్ వంటి ఆయుధాలను పవన్ అత్యంత స్టైలిష్‌గా ఉపయోగించిన తీరు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఇది పవన్ అభిమానులకు పండగలా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది.
2. ఓ అభిమాని తీసిన సినిమా
‘గబ్బర్ సింగ్’ సినిమాను ఒక అభిమాని తీస్తే ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు సుజీత్ వంతు. చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అయిన సుజీత్, కేవలం రీమేక్ కాకుండా, తన సొంత కథతోనే ‘ఓజీ’ని తెరకెక్కించాడు. టైటిల్ నుంచి ట్రైలర్ వరకూ ప్రతిదీ పవన్ ఇమేజ్‌కు తగ్గట్టుగా, విభిన్నంగా డిజైన్ చేశాడు. ‘రన్ రాజా రన్’, ‘సాహో’ చిత్రాల మాదిరిగానే ఈ సినిమాలో కూడా సుజీత్ ఊహించని ట్విస్ట్ ఇచ్చారా అనేది సినిమా చూస్తేనే తెలుస్తుంది.
3. తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్
‘ఓజీ’కి మరో బలం సంగీత దర్శకుడు తమన్. మాస్ సినిమాలకు తన బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో థియేటర్లను షేక్ చేయడంలో తమన్‌ది ప్రత్యేక శైలి. ‘ఓజీ’ విషయంలో తమన్ అంచనాలను మించిపోయారని, కొన్ని సంవత్సరాల పాటు ఆయన సంగీతం గుర్తుండిపోతుందని సుజీత్ స్వయంగా పేర్కొన్నారు.
4. బహుళ నటీనటులు
ఈ సినిమాలో విలన్‌గా ఇమ్రాన్ హష్మి పవన్‌కు గట్టి పోటీ ఇవ్వనున్నారు. అలాగే, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్, సుదేవ్ నాయర్, రాహుల్ రవీంద్రన్ వంటి నటీనటులు సినిమాకు అదనపు బలాన్ని చేకూర్చనున్నారు.
5. నిర్మాత ధైర్యం
పవన్ రాజకీయ షెడ్యూల్స్ కారణంగా సినిమా షూటింగ్ ఆలస్యమైనప్పటికీ, నిర్మాత డి.వి.వి. దానయ్య కథపై, పవన్‌పై ఉన్న నమ్మకంతో సినిమాను పూర్తి చేశారు. ఇటీవల విడుదలైన ‘మిరాయ్’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించగా, వాటి స్ఫూర్తితో ‘ఓజీ’ కూడా భారీ విజయం సాధిస్తుందని సినీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.