Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి నెట్‌ఫ్లిక్స్ స్పెషల్ ట్రిబ్యూట్.. ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ కేవలం బాక్సాఫీస్ వరకే పరిమితం కాలేదని, ఇప్పుడు అంతర్జాతీయ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలోనూ తన ప్రభావాన్ని చూపుతుందని నిరూపించింది ‘ఓజీ’ చిత్రం. దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ ఎంటర్‌టైనర్, విడుదలై సరికొత్త రికార్డులను సృష్టించింది.
‘ఓజీ’ సినిమా విడుదల రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించింది. విడుదలైన తొలి రోజునే ఏకంగా ₹154 కోట్ల గ్రాస్ కలెక్షన్‌ను సాధించి, భారతీయ సినిమా చరిత్రలో సంచలనం సృష్టించింది. ఇప్పటివరకు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ₹335 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇది పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే కాదు, తెలుగు సినీ పరిశ్రమలోనూ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఉండే ఉత్సాహానికి, థియేటర్ల వద్ద వారి హంగామాకు ఈ వసూళ్లు నిదర్శనం.
థియేటర్ల రికార్డుల తర్వాత, ఇటీవల ‘ఓజీ’ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. ఈ క్రమంలో దీపావళి పండుగ సందర్భంగా నెట్‌ఫ్లిక్స్ సంస్థ పవన్ కళ్యాణ్‌కు అదిరిపోయే ట్రిబ్యూట్ వీడియోను విడుదల చేసింది. ఈ ప్రత్యేక వీడియోలో పవన్ కళ్యాణ్ పెయింటింగ్‌ను దీపాలతో అత్యంత కళాత్మకంగా అలంకరించారు. ఒక భారతీయ స్టార్ హీరోకి అంతర్జాతీయ స్థాయి సంస్థ అయిన నెట్‌ఫ్లిక్స్ ఇలాంటి క్రియేటివ్ ట్రిబ్యూట్ ఇవ్వడం ఇదే తొలిసారి. ఈ ఘనత సాధించిన ఏకైక భారతీయ హీరో పవన్ కళ్యాణ్ కావడం అభిమానులందరికీ గర్వకారణం.
ఈ ట్రిబ్యూట్‌ను చూసిన పవన్ అభిమానులు సోషల్ మీడియాలో ‘ఎవ్వరికి అందదు అతని రేంజ్’ అంటూ ‘ఓజీ’ సినిమాలోని లిరిక్స్‌తో కామెంట్లు పెడుతూ సంతోషాన్ని పంచుకుంటున్నారు. ఇతర హీరోల అభిమానులు కూడా నెట్‌ఫ్లిక్స్ చేసిన ఈ సృజనాత్మక ప్రయత్నాన్ని ప్రశంసిస్తున్నారు. కాగా, ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్, త్వరలో దర్శకుడు సుజీత్‌తో కలిసి ‘ఓజీ సీక్వెల్ లేదా ప్రీక్వెల్’ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కోసం సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
