Pawan Kalyan : పిఠాపురం నియోజకవర్గ నాయకులతో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీరు బలంగా మారండి.. పార్టీని బలోపేతం చేయండి. ఇంట్లో కూర్చుని గెలిచేయాలి.. అధికారం వచ్చేయాలంటే కుదరదు. పార్టీ కోసం కష్టపడే నాయకులుగా మీరు మరింత మందిని కలుపుకొని ముందుకు వెళ్లాలి. అన్ని చోట్లకు పవన్ కళ్యాణ్ రావాలంటే ఎలా? పార్టీ ఉన్నతి కోసం బలంగా కష్టపడాలి.
మనందరిలో సమన్వయం అనేది ప్రధానం. నిజాయతీని నమ్ముకున్న పార్టీ మనది. జనసేన ప్రభుత్వాన్ని స్థాపించే దిశగా అడుగులు వేద్దామని ఆయన నియోజకవర్గ నాయకులతో దిశ నిర్దేశం సూచించారు. గురువారం గొల్లప్రోలులో ఓ ఫంక్షన్ హాల్లో పిఠాపురం నియోజకవర్గ నాయకులతో సమావేశం అయిన పవన్ కళ్యాణ్ చాలా అంశాల మీద నాయకులతో చర్చించారు.
ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ తో పాటు పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా నియోజకవర్గ రాజకీయ సమీకరణాలు, సమస్యలపై చర్చించారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కులాలు, వర్గాలను దాటి రాజకీయం చేయాలి. ఒక కులానికి ఒక పార్టీ అన్న పద్ధతి ఉండకూడదు. మన ఆలోచనలు ఉన్నతంగా ఉండాలి.
నాయకత్వమంతా ఒకే తరహా ఆలోచనలో ముందుకు వెళ్లాలి అని ఆయన సూచించారు. సోషల్ ఇంజినీరింగ్ లో భాగంగా కులాలన్నీ కలసికట్టుగా నడవాలన్నదే నా ఆలోచన. నేను విలువలు చెప్పను. వాటిని పాటించే వ్యక్తిని, కొత్తతరం నాయకుల్ని తీసుకురావాలన్నదే నా ఆకాంక్ష. తెలుగుదేశం, వైసీపీ లాంటి పార్టీలకు ఇన్ స్టెంట్ గా అనుభవం ఉన్నా నాయకులు దొరికేశారు.
వారికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ప్రతికూల పరిస్థితుల మధ్య మనం ఎదురెళ్తున్నాం. నాయకులుగా మీరు ముందుగా నియోజకవర్గాల్లో సమస్యలు తెలుసుకోండి. పని చేసుకుంటూ ముందుకు వెళ్లండి” అని పవన్ కళ్యాణ్ నాయకులకు స్పష్టం చేశారు.