Pawan Kalyan: ఇకపై సినిమాల్లో నటించడం కష్టమే, కానీ ఆ బిజినెస్ చేస్తా..: పవన్ కల్యాణ్
Pawan Kalyan: సినీ రంగంలో పవర్ స్టార్‌గా అభిమానుల గుండెల్లో నిలిచిన పవన్ కల్యాణ్.. రాజకీయాల్లోకి అడుగు పెట్టాక ఆయన సినీ ప్రస్థానంపై ఎప్పుడూ చర్చ జరుగుతూనే వస్తోంది. “జనసేన” పార్టీని స్థాపించి.. పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారిన తర్వాత కూడా ఆయన సినిమాలు చేస్తారా లేదా అనే సందేహం తరచుగా తలెత్తుతోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించి, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఆయన నటించిన హరిహర వీరమల్లు సినిమా తాజాగా విడుదల అయింది. ఈ సందర్భంగానే మాట్లాడుతూ.. ఆయన భవిష్యత్తులో సినిమాల్లో నటిస్తారా లేదా అనే ప్రశ్నకు సమాధానం చెప్పారు. అలాగే మరేం చేయాలనుకుంటున్నారో కూడా వివరించారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
వాస్తవానికి, పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించారు. “వకీల్ సాబ్”, “భీమ్లా నాయక్” వంటి చిత్రాలు ప్రేక్షకుల ఆదరణ పొందాయి. ప్రస్తుతం కూడా ఆయన చేతిలో కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో “ఓజీ (OG)”, “ఉస్తాద్ భగత్ సింగ్”లు ఉన్నాయి. పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక విడుదల అయిన తొలి సినిమా “హరి హర వీరమల్లు”. ఈ సినిమా విడుదల సందర్భంగానే మాట్లాడుతూ ఆయన షాకింగ్ కామెంట్లు చేశారు. ఎవరూ 24 గంటలూ పని చేయలేరని చెప్పారు. అలాగే కొంత విశ్రాంతి కూడా అవసరం అని వ్యాఖ్యానించారు. మనం ఉన్న రంగంలో అధ్యయనం చేయాలన్నారు.
అన్నిసార్లు నటించాల్సిన అవసరం లేదు..
ఎక్కడ ఉన్నామన్నది కాదని.. ఎంత బాగా చేశామన్నదే ముఖ్యం అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత 6 నెలల అస్సలే ఖాళీగా లేనని.. తనకంటూ ఉన్న టైంలోనే సినిమా పూర్తి చేసినట్లు చెప్పారు. అన్నిసార్లు తాను నటించాల్సిన అవసరం లేదని వివరించారు. దీన్ని బట్టి చూస్తే ఈయనకు సినిమాలు చేసే ఆలోచన లేనట్లు తెలుస్తోంది. కాకపోతే సొంతంగా సినిమాలను నిర్మిస్తానని చెప్పారు.
పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్..
భవిష్యత్తులోనే దీనిపైనే ఎక్కువ దృష్టి పెడతానని.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో అదే కాస్త సులువు అని వ్యాఖ్యానించారు. పదేళ్ల కిందటే పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ప్రారంభించానన్నారు. తాను రాజకీయాల్లోకి రావడం వల్ల దాన్ని యాక్టివేట్ చేయకుండా వదిలేశానన్నారు. ఈ కామెంట్లు చూస్తుంటే.. సినిమాల్లో నటించడం మానేసి.. నిర్మించడం మాత్రమే చేస్తారని అర్థం అవుతోంది. కానీ చూడాలి మరి మున్ముందు ఏం చేస్తారనేది.
