Pawan Kalyan – Veera Mahilalu : మంగళగిరిలో వీర మహిళలతో ఏర్పాటు చేసిన సమావేశంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. కవి కేశవరెడ్డి గారి కథలో రాము రాముడుండాడు… రాజ్యముండాది అన్నట్లుగా దేశంలో ఎక్కడికి వెళ్లినా జగన్ లాంటి మనుషులు కనిపిస్తూనే ఉంటారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ జగన్ వస్తే మేం ఇక్కడి నుంచి పారిపోతాం ఉండలేం అని నాకు చెప్పుకొని బాధపడేవారే ఎక్కువ కనిపిస్తారు. వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, డాక్టర్లు ఇలా చిన్న వర్గాల వారు జగన్ పరిపాలన అస్తవ్యస్తంగా ఉందని, బతకడానికి భయపడే పరిస్థితులు వచ్చేస్తాయని మధనపడుతుంటారు.
అందరికీ నేను చెప్పేది ఒక్కటే ఎక్కడికి వెళ్లినా జగన్ వంటి వ్యక్తులు, అతడి కంటే క్రూరమైన వారు కనిపిస్తూనే ఉంటారు. ఓ నది ఈ నేల విడిచి ఎలా పారిపోలేదో మనం కూడా ఈ నేలను విడిచి పారిపోవాల్సిన అవసరం లేదు. అన్ని వర్గాల వారు జగన్ పాలన చూసి భయపడుతున్నారు. కానీ సమష్టిగా, ఉమ్మడిగా పోరాడి జగన్ లాంటి వారిని తరిమికొట్టాల్సిన అవసరం ఉంది. వచ్చే ఎన్నికల్లో ఓటు అనే వజ్రాయుధం ఉపయోగించి జగన్ వంటి వ్యక్తులను తరిమి కొడదాం. ఈ నేల మనది రాజ్యం మనది.. రాముడు మన వాడు. ఎక్కడికి పారిపోకుండానే జన రాజ్యం తెచ్చుకుందాం.
ముఖ్యమంత్రి నివాసం ఉండే తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోనే నేరాల రేటు ఎక్కువగా ఉంది. సీఎం నివాసానికి కూత వేటు దూరంలో ఓ అంధురాలిపై వేధింపులకు దిగి హత్య చేస్తే ఈ ముఖ్యమంత్రి, మంత్రుల నుంచి స్పందన ఉండదు. నన్ను తిట్టడానికి లేచే నోర్లు అప్పుడు మూతపడిపోతాయి. రేపల్లెలో తన సోదరిని వేధించిన వారిని ప్రశ్నించిన అమర్నాథ్ అనే బాలుడిని పెట్రోలు పోసి తగులబెట్టి హత్య చేస్తే, ఈ వైసీపీ నాయకులు రాజీ చేయడానికి వెళ్తారు. ప్రభుత్వ విధానాలపై దైర్యంగా మాట్లాడే జనసేన అధికార ప్రతినిధి శ్రీమతి కీర్తన మీద వైసీపీ ప్రతినిధులు అనుచితంగా మాట్లాడతారు. ఎలా ఉండాలి..? ఏం చేయాలి..? అనేది నిర్ణయించడానికి వైసీపీ నాయకులకు ఏం అధికారం ఉంది.
మహిళలకు న్యాయం చేయలేని, వారిని గౌరవించలేదని మనసుతో మీరు ఎన్ని చట్టాలు చేసినా వృథా. 30 వేల మంది మహిళలు అదృశ్యం అయిపోయారని నేను చెబితే.. తప్పుడు సమాచారం అన్నారు. సాక్షాత్తూ పార్లమెంటులోనే అది నిర్ధారణ అయ్యాక అయినా, కనీసం సమీక్ష పెట్టలేదు. మహిళలు, చిన్నారులు అక్రమ రవాణా అవుతుంటే కనీసం దానిపైనా ఓ సమావేశం పెట్టలేని నిర్లక్యం.. అది పెద్ద సమస్య కాదు అనే భావన ముఖ్యమంత్రిది. శాంతిభద్రతల రక్షణకు జనసేన ప్రభుత్వంలో మొదటి ప్రాధాన్యం ఉంటుంది. మహిళల భద్రతను మేం అనునిత్యం కాపాడేందుకు వ్యవస్థలను పనిచేసేలా చేస్తాం.