Pawan Kalyan – Vishakha : జనసేన పార్టీకి విశాఖ చాలా కీలకమైన ప్రాంతం. విశాఖలో ప్రభుత్వం మనల్ని ఇబ్బందిపెట్టి గొడవ జరిగినప్పుడు. పోలీసులు పెట్టిన ఇబ్బందులు తట్టుకుని నిలబడిన మహిళా నాయకులు, నాయకులందరినీ పేరు పేరునా అభినందిస్తున్నా. ఆ రోజు ఘటనతో పరిపాలన చేతకాని ఈ ప్రభుత్వానికి నిలదీసేది జనసేన పార్టీ మాత్రమేనన్న విషయం అందరికీ అర్ధం అయ్యింది. ఆ బలమే ఈ రోజు ఢిల్లీకీ పిలిపించింది.
ఎన్డీఏలో అంతటి స్థానం దక్కడానికి కీలక మలుపు విశాఖ ఘటనే, ఈ పార్టీ ఎక్కడికి పోదన్న విషయం ప్రజలకు అవగతం అయింది. వైసీపీ కుటిల రాజకీయాన్ని తట్టుకుని నిలబడగలమనే మనకు ప్రజలు అంత గౌరవం ఇస్తున్నారు. వైసీపీ పాలనలో విశాఖలో విపరీతమైన భూ ఆక్రమణలు, ప్రకృతి విధ్వంసం జరుగుతున్నాయి. పారిశ్రామిక కాలుష్యాన్ని తగ్గించాల్సి ఉంది. ఈ అంశాల మీద ఎవరూ దృష్టి సారించడం లేదు. నేను ఎన్నికల ముందే చెప్పాను. వీళ్లు అధికారంలోకి వస్తే కొండలు మింగేస్తారని.
నిజంగానే కొండలు మింగేశారు. మనకి రాటుతేలిన నాయకత్వం ఉంది. భయాలు మన మనసులో నుంచి తీసేశాం. మహిళలు మిస్సవుతున్నారని చెప్పిన తర్వాత తిరుపతి వెళ్తే అధికారులు ఇబ్బందికరంగా మాట్లాడారు. అలా ఎలా చెప్పిస్తారని ఎస్పీ అన్నారు. కేంద్రం నుంచి వచ్చిన డేటా ఆధారంగా అని బలంగా చెప్పా. అదే విషయాన్ని కేంద్ర హోం శాఖ మొన్న పార్లమెంటులో చెప్పింది. రాష్ట్రంలో 30 వేల మంది మహిళలు మిస్సయ్యారు. నేను ఏం మాట్లాడినా
ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని మాట్లాడుతా. ఊరికే ఆరోపణలు చేయడం నాకు ఇష్టం ఉండదు. వాలంటీర్ వ్యవస్థ మీద మాట్లాడింది.. పెందుర్తిలో రుజువయ్యింది, వాలంటీర్ వ్యవస్థ ఉద్యోగ సమస్య కాదు. పంచాయితీ రాజ్ వ్యవస్థను చంపేయడానికి సృష్టించిన ఒక సమాంతర వ్యవస్థ. పెందుర్తిలో వాలంటీర్ పెద్దావిడను హత్య చేసిన విషయం నన్ను బాగా కదలించింది. వారి కుటుంబాన్ని వారాహి యాత్రలో భాగంగా కలుద్దాం.
యాత్రలో మంత్రులు చేసిన భూకబ్జాలను పరిశీలిద్దాం. పారిశ్రామిక కాలుష్యం, ఎర్రమట్టి దిబ్బలు అయితే ఖచ్చితంగా చూడాలి. రుషికొండ లాంటి అంశాలు రాష్ట్రం మొత్తం తెలియాలి. గంగవరం పోర్టు, స్టీల్ ప్లాంటు తదితర అంశాల మీద ముందుకు వెళ్తాం. రెడ్జింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ప్రైవేటీకరణ అంశంలో మనం లేవనెత్తిన అంశాలు కేంద్రానికి సబబుగా అనిపించి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.
స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రజలు రోడ్ల మీదకు వస్తే కేంద్రం ఖచ్చితంగా పరిశీలిస్తుంది. అంత మొండి నిర్ణయాలు తీసుకోదు. మన వరకు స్టీల్ ప్లాంట్ అంశం మీద ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి అడుగుతున్నాం. గంగవరం నుంచి మత్స్యకారులు వచ్చారు. గంగవరం పోర్టు అదాని నిర్వహణకు వెళ్ళినప్పుడు వారికి మెయిన్ పోర్టులో ఉద్యోగాలు ఇవ్వలేదు. సాధ్యమైనంత వరకు వారందరిని కలిసే ప్రయత్నం చేద్దామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.