Pawan Kalyan – Vizag : ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి, అధికార ప్రభుత్వం చేస్తున్న ఆగడాలను బయట పెట్టడానికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన వారాహి విజయయాత్ర ఎంత విజయవంతంగా తూర్పు,పశ్చిమగోదావరి జిల్లాలో ముగిసిందో మనకు విదితమే. అదే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వైజాగ్ నగరంలో కూడా వారాహియాత్రను మొదలుపెట్టాలని ఆకాంక్షించారు. దానికి కావలసిన సన్నాహాలు కూడా పూర్తిగా చేశారు.
తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలో మొదలుపెట్టిన వారాహి విజయయాత్ర ఎంత ప్రభంజనం సృష్టించిందో మనందరికీ తెలుసు. ప్రజల నుండి ఊహించని విధంగా విశేష స్పందన జనసేన అధినేత అందుకున్నారు. అలాగే పవన్, వైసీపీ నేతలు చేస్తున్నటువంటి అక్రమాలపై, ప్రభుత్వ తీరుపై తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైఫల్యాలను రుజువులతో సహా బయట పెడుతూ ప్రభుత్వ విధానాన్ని ఎండగడుతూ వచ్చారు.

రెండో దశ యాత్రలో పవన్ కళ్యాణ్ కీలక అంశాల పైన చర్చించారు. వాటిల్లో అతి ముఖ్యమైనది వాలాంటిర్ వ్యవస్థ పైన ఆయన మాట్లాడారు. ఈ వ్యవస్థ గురించి అధికార ప్రభుత్వం పైన ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎక్కడ కూడా వాటికి తగ్గ సమాధానాలు అధికార ప్రభుత్వం ఇవ్వకపోగా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం పైన తీవ్ర దూషణలు చేశారు. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన జనసేన నేతలు అధికార ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మలను దహనం చేస్తూ, నిరసన తెలుపుతూ అరెస్టులు కూడా గావింపబడ్డారు. ఇది ఇలా ఉండగా ఆగస్టు 10 వ తేదీ నుండి
వైజాగ్ నగరంలో జనసేన వారాహియాత్ర ప్రారంభమై 19 తేదీ వరకు కోనసాగానుంది. యాత్ర గురించి జనసేన నాయకులు పోలీసులను అనుమతుల కోసం సంప్రదించగా, పోలీసులు పెట్టినటువంటి షరతులు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ముఖ్యంగా జగదాంబ సెంటర్లో మాత్రమే అనుమతినిచ్చిన పోలీసులు ర్యాలీపై నిషేధాన్ని విధించారు. అలాగే ర్యాలీ సమయంలో అభివాదాలు చేయకూడదని, భవనాలు ఇతర ఎత్తైన నిర్మాణాలపై అభిమానులు కానీ కార్యకర్తలు

ఎక్కకుండా చూసుకోవలసిన బాధ్యత జనసేన పార్టీదేనని ఇటువంటి షరతులను ఉల్లంఘించిన యెడల పోలీసు వ్యవస్థ చర్యలు తీసుకుంటుందని, పెట్టినటువంటి షరతులను ఎవరైనా ఉల్లంఘిస్తే దానికి పూర్తి బాధ్యత జనసేన పార్టీనే వహించాలని పోలీసు వ్యవస్థ స్పష్టం చేసింది. పోలీసు వ్యవస్థ విధించినటువంటి ఈ ఆంక్షల పట్ల జనసేన పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి వస్తున్న విశేష ప్రజా స్పందనను అడ్డుకోవడం కోసమే అధికార ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడుతుందని జనసేన శ్రేణులు స్పష్టం చేశాయి.
