Pawan Kalyan: బాధ్యతాయుత పౌరుడు సాయిదుర్గ తేజ్.. మేనల్లుడికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక శుభాకాంక్షలు
Pawan Kalyan: టాలీవుడ్ యువ కథానాయకుడు సాయి దుర్గా తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మేనల్లుడిపై తనకున్న ఆప్యాయతను, అతనిలోని మంచి లక్షణాలను వివరిస్తూ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో ప్రత్యేక పోస్ట్ పెట్టారు.
సాయి దుర్గా తేజ్ కేవలం నటుడిగానే కాకుండా, సామాజిక స్పృహ కలిగిన బాధ్యతాయుతమైన పౌరుడిగా కూడా వ్యవహరిస్తున్నారని పవన్ కళ్యాణ్ కొనియాడారు. “యువ కథానాయకుడు సాయి దుర్గా తేజ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు,” అంటూ తన పోస్ట్ ప్రారంభించారు.
“కష్టే ఫలే” అనే మాటను పూర్తి చిత్తశుద్ధితో ఆచరించే తత్వం తేజ్‌లో ఉందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచీ తనదైన శైలిలో ప్రతి రోజూ ఎంతో తపనతో నటిస్తున్నారని తెలిపారు. నటనతో పాటు, సమాజంలోని వర్తమాన విషయాలపై స్పందించే తత్వం సాయి దుర్గా తేజ్‌లో ఉందని ఆయన అన్నారు.
ముఖ్యంగా, రహదారి భద్రత వంటి కీలక అంశాలపై, అలాగే సోషల్ మీడియాలో అపసవ్య ధోరణులపై ప్రజలను చైతన్యపరుస్తూ సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. నటుడిగా సాయి దుర్గా తేజ్ మరిన్ని విజయాలు అందుకోవాలని, అలాగే ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని తాను భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం మెగా అభిమానుల్లో వైరల్ అవుతోంది.
https://x.com/APDeputyCMO/status/1978329251850891450
