Pawan Kalyan – YCP : దుష్టులు..దుర్మార్గులను పెంచి పోషిస్తే ఇంట్లో ఆడవాళ్ళ మీద దాడి చేస్తారు. పెందుర్తి నియోజకవర్గం సుజాత నగర్ మీడియా సమావేశంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ.. బంగారు ఆభరణాల కోసం ఒంటరి వృద్ధురాలిని వాలంటీర్ అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన గురించి తెలుసుకొంటే బాధ ఆగలేదు. ముఖంపై పిడిగుద్దులు గుద్ది, పీక నులిమి అత్యంత భయానకంగా హత్య చేశాడు.
ఆమె నివసిస్తున్న ప్రాంతానికి దగ్గరలోనే ఉన్నా మా అమ్మను కాపాడుకోలేకపోయామని వృద్ధురాలి కొడుకు పడుతున్న ఆవేదన చూసి కడుపు తఋక్కుపోతోంది. హత్య జరిగి పది రోజులు కావొస్తున్న ఇప్పటి వరకూ ప్రభుత్వం నుంచి ఒక్క నాయకుడు కూడా పరామర్శకు రాలేదు అంటే వాళ్ల ఆలోచన విధానం ఏంటో అర్ధమవుతుందని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అన్నారు.
పెందుర్తి సుజాతనగర్ లో ఇటీవల వాలంటీర్ చేతిలో హత్యకు గురైన శ్రీమతి కోటగిరి వరలక్ష్మి గారి కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ గారు శనివారం పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడే దైర్యం చెప్పారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు, పార్టీ నేతలు ఈ పరామర్శలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ… వైసీపీ ప్రభుత్వం తమ నవరత్నాల కోసం నియమించిన వాలంటీర్ వ్యవస్థ ఈ రోజు ప్రజల ప్రాణాలు తీస్తోంది.
కొంతమంది వాలంటీర్లు అసాంఘిక శక్తులుగా మారి నేరాలకు తెగబడుతున్నారు. వాళ్లు చేస్తున్న దురాగతాలు కొన్ని మాత్రమే బయటకు వస్తున్నాయి. బయటకు రాని నేరాలు చాలానే ఉన్నాయి. పాస్ పోర్టు కావాలన్నా, చిన్నపాటి ఉద్యోగానికైనా పోలీస్ వెరిఫికేషన్ చేస్తారు. వాలంటీర్ అనే ఈ సమాంతరం వ్యవస్థలో ఉద్యోగాలు ఇస్తున్నప్పుడు ఎందుకు పోలీస్ వెరిఫికేషన్ చేయడం లేదు? వైసీపీ తన కోసం వినియోగించుకునే వ్యవస్థను నిబంధనలు గాలికొదిలి తయారు చేస్తోంది..
ఇళ్లలోకి చొరబడి మరీ సమాచారం సేకరిస్తున్న వాలంటీర్లు అసలు ఎలాంటి వారో కూడా చూడకుండానే వారిని నియమించడం ఎంత వరకు సబబు..? వాలంటీర్ల ముసుగులో కొందరు చేస్తున్న దురాగతాలు రోజుకొకటిగా వెలుగు చూస్తున్నాయి. వీరిపై పర్యవేక్షణ లేకపోవడంతో, క్షేత్రస్థాయిలో వారు రెచ్చిపోతున్నారు. ఇదొక దండుపాళ్యం బ్యాచ్ లా తయారైంది అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.