OG Movie: పవన్ కళ్యాణ్ ‘OG’కి అండగా ‘మిరాయ్’ నిర్మాత – థియేటర్లలో కొత్త సందడి
OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఓజీ’ (OG) చిత్రం విడుదలకు మార్గం సుగమమైంది. దర్శకుడు సుజీత్ రూపొందించిన ఈ సినిమా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ‘మిరాయ్’ (Mirai) సినిమా నిర్మాత విశ్వప్రసాద్ తీసుకున్న గొప్ప నిర్ణయం ఇప్పుడు సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది.
తేజ సజ్జా కథానాయకుడిగా నటించిన ‘మిరాయ్’ సెప్టెంబర్ 12న విడుదలైనప్పటి నుంచీ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికీ పలు థియేటర్లలో ఈ సినిమా హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఇలాంటి సమయంలో, పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం విశ్వప్రసాద్ ఒక అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. ‘మిరాయ్’ ప్రదర్శిస్తున్న కొన్ని థియేటర్లలో సెప్టెంబర్ 25న ఒక్కరోజు మాత్రం ‘ఓజీ’ చిత్రాన్ని ప్రదర్శించేందుకు అంగీకరించారు. మరుసటి రోజు, సెప్టెంబర్ 26 నుంచి యథావిధిగా అదే థియేటర్లలో ‘మిరాయ్’ ప్రదర్శనలు కొనసాగుతాయి.
విశ్వప్రసాద్ తీసుకున్న ఈ నిర్ణయంపై పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి పెద్ద ఎత్తున అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సినిమా రంగంలో అరుదుగా కనిపించే ఈ తరహా సహకారంపై సినీ వర్గాలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ‘ఓజీ’ విడుదలకు ఇది ఒక గొప్ప ప్రోత్సాహం అని విశ్లేషకులు చెబుతున్నారు.
మరోవైపు, గతంలో ‘ఓజీ’ చిత్రానికి సంబంధించిన కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ముఖ్యంగా నార్త్‌లో సినిమా డిజిటల్ ప్రింట్లు ఇంకా చేరలేదని, కొన్ని కారణాల వల్ల కెనడాలోనూ సినిమా ప్రదర్శన నిలిచిపోయిందని నిర్మాణ సంస్థ ఇటీవల ప్రకటించింది. అయితే, తాజాగా డిస్ట్రిబ్యూటర్లు తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఈ సమస్యలు పరిష్కారమయ్యాయని, ప్రింట్లు అందాయని తెలిపారు. దీంతో, ‘ఓజీ’ విడుదలకు అడ్డంకులు పూర్తిగా తొలగిపోయినట్లైంది. అభిమానులు ఇప్పుడు సినిమా విడుదల కోసం మరింత ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ‘మిరాయ్’ నిర్మాత సహకారంతో ‘ఓజీ’కి ఒక రోజు ముందే మంచి హైప్ క్రియేట్ అయినట్లు అయింది. ఈ శుభవార్తతో పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.