Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’.. ఇదెక్కడి క్రేజ్ రా బాబు.. అప్పుడే అడ్వాన్స్ బుకింగ్స్
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త. గత కొంతకాలంగా ఊహాగానాలకు, పుకార్లకు తావు లేకుండా, ఆయన తదుపరి చిత్రం ‘ఓజీ’ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 25న విడుదల కానుందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. దీనికి తోడు, అమెరికాలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఆగస్టు 29న ప్రారంభం కానున్నట్లు ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిరా సినిమాస్ వెల్లడించింది. సెప్టెంబర్ 24న అమెరికాలో ప్రీమియర్ షోలు ప్రదర్శితం కానున్నాయి. దీంతో, సినిమా విడుదల విషయంలో ఎటువంటి జాప్యం లేదని తేలిపోయింది.
పవన్ కళ్యాణ్ చివరి చిత్రం ‘హరిహర వీరమల్లు’ మిక్స్‌డ్ టాక్ అందుకోగా.. ‘ఓజీ’పై అభిమానుల అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్లు, పాటలు, ప్రచార చిత్రాలు ఈ అంచనాలను మరింత పెంచాయి. ముఖ్యంగా, ‘నెత్తురుకు మరిగిన హంగ్రీ చీతా’ పాట, ఆ తర్వాత విడుదలైన ‘ఫైర్ స్ట్రోమ్’ పాటలు సోషల్ మీడియాలో భారీ వ్యూస్‌తో దూసుకుపోతున్నాయి. సంగీత దర్శకుడు థమన్ అందించిన సంగీతం సినిమా హైప్‌ను మరింత పెంచింది.
యంగ్ డైరెక్టర్ సుజీత్ టేకింగ్‌తో రూపొందిన ఈ చిత్రం, పవన్ కళ్యాణ్‌ను ఒక స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో చూపిస్తుంది. ఈ పాత్రకు ఓజస్ గంభీరా అని పేరు పెట్టారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్ పాత్రలు ఎన్నో విజయాలను సాధించాయి. ఇప్పుడు ‘ఓజీ’లో ఆయన పవర్‌ఫుల్ లుక్, యాక్షన్ పర్ఫార్మెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ సినిమాలో పవన్ సరసన ప్రియాంక మోహన్ నటిస్తుండగా, ప్రకాశ్ రాజ్, శ్రియా రెడ్డి వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య, ఆయన తనయుడు దాసరి కళ్యాణ్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థియేటర్లలోకి సినిమా రావడానికి ఇంకా కొన్ని వారాలు మాత్రమే మిగిలి ఉండటంతో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా పవన్ అభిమానుల సంబరాలు మొదలయ్యాయి. ఇది కేవలం ఒక సినిమా విడుదల కాదని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన నిజమైన పవర్ ఏంటో చూపించబోతున్నాడని అభిమానులు నమ్ముతున్నారు.