Pawan Kalyan OG: ఓజీ స్టోరీ లైన్ ఇదేనా.. ఓర్నాయనో ఫ్యాన్స్‌కు పిచ్చెక్కాల్సిందేగా..
Pawan Kalyan OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఓజీ’ చిత్రం దసరా కానుకగా సెప్టెంబర్ 25న విడుదల కానుంది. ముందుగా ఇదే రోజున విడుదల కావాల్సిన నందమూరి బాలకృష్ణ ‘అఖండ 2’ రేసు నుంచి తప్పుకోవడంతో ‘ఓజీ’కి మరింత అనుకూలంగా మారింది.
యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయ, ఇతర సినిమాల షెడ్యూల్స్ కారణంగా ఈ సినిమా విడుదల ఆలస్యమైనప్పటికీ, ఇప్పుడు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమా కథాంశంపై ఆసక్తికరమైన సమాచారం ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పవన్ కళ్యాణ్ ‘ఓజస్ గంభీర’ అనే ముంబై అండర్ వరల్డ్ డాన్‌గా కనిపిస్తారని, పదేళ్లు అజ్ఞాతంలోకి వెళ్లిన అతను, మళ్లీ తిరిగి వచ్చి తన సామ్రాజ్యాన్ని ఎలా చేజిక్కించుకున్నాడనేది ప్రధాన కథాంశమని తెలుస్తోంది. తనను మోసం చేసిన వారిపై పగ తీర్చుకోవడం, ప్రత్యర్థులను అణచివేయడం వంటి సన్నివేశాలను సుజీత్ చాలా స్టైలిష్‌గా, గ్రిప్పింగ్‌గా తెరకెక్కించారని ప్రచారం జరుగుతోంది. కథ వినడానికి రొటీన్‌గా అనిపించినా, సుజీత్ టేకింగ్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుందని సినీ పండితులు భావిస్తున్నారు.
వినాయక చవితి సందర్భంగా విడుదలైన ‘సువ్వి సువ్వి’ పాటలో పవన్ కళ్యాణ్ లుక్, ఎనర్జీ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా పవన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి.
‘ఓజీ’ సినిమా విడుదలకు ముందే రికార్డు స్థాయిలో ప్రీ-రిలీజ్ బిజినెస్ చేస్తోందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం, తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ రూ. 155 కోట్లకు పైగా పలుకుతున్నట్లు సమాచారం. నైజాం ప్రాంతంలో రూ. 60 కోట్లు, ఆంధ్రాలో రూ. 70 కోట్లు, సీడెడ్‌లో రూ. 25 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా, ఈ సినిమా శాటిలైట్ హక్కులను స్టార్ గోల్డ్ ఛానల్ భారీ ధరకు దక్కించుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.