OG Movie: రాజకీయాల్లోకి వచ్చే వాడినే కాదు: పవన్ కళ్యాణ్
OG Movie: ‘ఓజీ’ సినిమా ఈనెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోన్న సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ‘ఓజీ కాన్సర్ట్’లో పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం అభిమానులతో పాటు సినీ వర్గాలను ఆకట్టుకుంది. ఓజీ మూవీలో పవన్‌ను తెరపై చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రేక్షకుల్లో అంచనాలను మరింత పెంచాయి.
వర్షం కురుస్తున్నప్పటికీ, పవన్ కళ్యాణ్ తడుస్తూనే అభిమానుల కోసం తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఈ సినిమాపై మీరు చూపిస్తున్న ప్రేమను చూసి ఆశ్చర్యపోయాను. ‘ఖుషి’ చిత్ర సమయంలో ఇలాంటి ఉత్సాహాన్ని చూశాను. రాజకీయాల్లోకి వచ్చినా అభిమానులు నన్ను వదల్లేదని ఈ ఆదరణను బట్టే అర్థమవుతోంది” అని అన్నారు.
ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన యువ దర్శకుడు సుజీత్‌ను పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. “సుజీత్ నాకు వీరాభిమాని. ‘సాహో’ తర్వాత త్రివిక్రమ్ నన్ను అతనికి పరిచయం చేశారు. కథను సంక్షిప్తంగా చెప్పినా, తెరపై దాన్ని ఆవిష్కరించే విధానం చూస్తే అతనికి ఎంత ప్రతిభ ఉందో అర్థమవుతుంది. ఈ చిత్ర విజయంలో ఎక్కువ క్రెడిట్ సుజీత్‌కే దక్కుతుంది. అలాగే, తమన్ సంగీతం సినిమాకు ప్రాణం పోసింది. ఈ ఇద్దరు కలిసి సినిమాను ఒక ప్రత్యేక స్థాయికి తీసుకెళ్లారు. నేనొక డిప్యూటీ సీఎం అన్న సంగతే మర్చిపోయేంతలా నన్ను ఈ పాత్రలో లీనమయ్యేలా చేశారు. ఓ డిప్యూటీ సీఎం కత్తి పట్టుకుని వస్తే ఎవరైనా ఊరుకుంటారా?” అని నవ్వుతూ ప్రశ్నించారు.
ఈ చిత్రంలో తాను పాడిన “వాషి యో వాషి” అనే జపనీస్ హైకూ గురించి కూడా పవన్ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. కథలో విలన్‌కు హీరోకు ఉన్న గ్యాప్‌ను హైలైట్ చేయడానికి ఈ పాటను ఉపయోగించారని, ఈ హైకూను తమన్, అభిమానుల కోరిక మేరకు పాడానని తెలిపారు. ఈ సినిమాలో అద్భుతమైన నటుడు ఇమ్రాన్ హష్మీతో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. అలాగే, ప్రియాంక మోహన్‌తో తన ప్రేమకథ చిన్నదైనప్పటికీ, అది చాలా హృద్యంగా ఉంటుందని తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రులకు కృతజ్ఞతలు
‘ఓజీ’ సినిమాకు సహకరించినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్ర కాన్సర్ట్‌లో అల్లు అరవింద్, దిల్‌రాజు వంటి ప్రముఖులు పాల్గొన్నారు.
