కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్లో విజృంభిస్తున్న ఈ సమయంలో వైద్య ఆరోగ్య సిబ్బంది పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించడం దురదృష్టకరమని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆయన విడుదల చేసిన లేఖలో covid 19 సంబంధించి విధులకు నియమించుకున్న మెడికల్ ఆఫీసర్లు, స్పెషలిస్ట్ వైద్యులు, స్టాఫ్ నర్స్ లతోపాటు, ఇతర సిబ్బందికి రెండు నెలలుగా జీతాలు చెల్లించడం లేదు. కరోనా అంటే ప్రతి ఒక్కరూ భయపడిపోతున్న తరుణంలో ఎంతో ధైర్యంగా వృత్తిపట్ల నిబద్ధతతో విధులను నిర్వర్తించిన వారికి కనీసం జీతం ఇవ్వకపోవడం అనేది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే అని ఆయన అన్నారు. కొద్ది నెలల క్రితం మెడికోలకు స్టైఫండ్ నిలిపినప్పుడు మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు స్పందించిన తర్వాతే వారికి నిధులను విడుదల చేశారని. అలాగే ఈ విషయం కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చిందని, కచ్చితంగా ప్రభుత్వం వైద్య సిబ్బందికి త్వరలోనే జీతాలు అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ విధుల కోసమే 1170 మంది స్పెషలిస్ట్ వైద్యులను, 1170 మంది మెడికల్ ఆఫీసర్లను, 2 వేల మంది నర్సులను, 1200 మందికి పైగా పారా మెడికల్,ఇతర సిబ్బందిని,1700 ఆరోగ్య కార్యకర్తలను నియమించుకుంది అని వీరెవరికీ జీతాలు అందడం లేదని, ఉద్యోగంలో చేరినప్పటి నుండి అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న వారికి సకాలంలో జీతాలు చెల్లించకపోవడాన్ని జనసేన పార్టీ ఖండిస్తూ ఉందని ఆయన తెలిపారు. ప్రభుత్వం వైద్య సిబ్బందికి, మెడికల్ ఆఫీసర్ లకు తక్షణమే జీతాలు చెల్లించాలని అదేవిధంగా వారికి ఒక నెల జీతం అడ్వాన్సుగా అందజేయాలని ఆయన కోరారు.