సంక్షేమ పథకాల్లో తనదైన దూకుడు ప్రదర్శిస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మరో బీమా పథకానికి శ్రీకారం చుట్టారు. పేద కుటుంబాలకు అండగా ఉండేలా వైయస్సార్ బీమా పథకాన్ని నిన్న తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ప్రారంభించి లబ్ధిదారులకు బీమా చెక్ లు, వైయస్సార్ బీమా కార్డులు పంపిణీ చేసి మరో సంక్షేమ పథకాన్ని ప్రజల ముందుకు తీసుకువచ్చారు.
గతంలో కేంద్రం ప్రతి పాలసీకి PMJJBY, PMSBY కింద 50 శాతం వాటా భరించేది, ఇప్పుడు ఆ వాటా లేనప్పటికీ పూర్తి ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ ఉచిత బీమా అమలు చేస్తోందని ,ఆ భారం రాష్ట్ర ప్రభుత్వంపైనే పడుతుందని తెలిసినప్పటికీ.. ప్రజలు ఇబ్బంది పడతారు కాబట్టి, పేద కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించేలా ఈ పథకం తీసుకొచ్చినట్లు ముఖ్యమంత్రి వివరించారు.
సంపాదించే వ్యక్తి పొరపాటున మరణిస్తే ఆ కుటుంబం ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశ్యంతో మానవతా దృక్పథంతో ఈ పథకం ముందుకు తీసుకు వచ్చినట్లు జగన్ తెలిపారు. ఒక కుటుంబంలోని 18-50 సం,,ల వ్యక్తి సహజ మరణం అయితే 2 లక్షల రూపాయలు,
ప్రమాదంలో చనిపోతే 5 లక్షల రూపాయలు బీమా ప్రభుత్వం అందిస్తుంది.
అలానే పాక్షిక అంగవైకల్యం 18- 70 సం,, వయసు గలవారికి 1 లక్ష 50 వేలు, 18-50 మధ్య వయస్సు గల వారు శాశ్వత అంగవైకల్యానికి 5 లక్షలు ఈ పథకంలో భాగంగా అందిస్తామని తెలిపారు. ఏటా 510 కోట్ల రూపాయల ఖర్చుతో 1..41 కోట్ల బియ్యం కార్డు అర్హత కలిగిన కుటుంబాల తరఫున బీమా ప్రీమియం ప్రభుత్వం చెల్లించనుంది.
వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి లబ్ధిదారులను గుర్తించాల్సిందిగా సీఎం జగన్ సూచించారు. లబ్ధిదారులకు బ్యాంకు ఖాతా ఏర్పాటు నుండి బీమా నమోదు, భీమా ప్రాసెసింగ్, క్లెయిమ్ చెల్లింపుల వరకు సహాయ కేంద్రాలుగా గ్రామ/ వార్డు సచివాలయాలు, సహాయం కోసం అక్కడున్న వెల్ఫేర్ అసిస్టెంట్/ వాలంటీర్లను సంప్రదించాలని తెలిపారు.
