Modi Ram Charan: విలువిద్య కోసం ఉపాసన కృషి ప్రశంసనీయం.. ప్రధాని మోదీ ట్వీట్
Modi Ram Charan: భారతీయ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు రామ్ చరణ్, ఉపాసన కొణిదెల, అనిల్ కామినేనిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ముఖ్యంగా విలువిద్య క్రీడను దేశంలో ప్రోత్సహించడానికి ఉపాసన, అనిల్ కామినేని చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు. ఈ మేరకు ప్రధాని మోదీ వీరిని కలిసిన ఫొటోలను ‘ఎక్స్’ వేదికగా పంచుకుంటూ తెలుగులో పోస్ట్ చేశారు.
“ఉపాసన, అనిల్ కామినేనిని కలవడం సంతోషంగా ఉంది. విలువిద్యను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి మీరు చేస్తున్న సమష్టి ప్రయత్నాలు అభినందనీయం. మీ ఈ కృషి ఎంతో మంది యువతకు లబ్ది చేకూరుస్తుంది,” అని ప్రధాని మోదీ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (APL) తొలి సీజన్ విజయవంతమైన నేపథ్యంలో, లీగ్ ఛైర్మన్ అనిల్ కామినేని, ఆయన సతీమణి ఉపాసన కొణిదెలతో కలిసి రామ్ చరణ్ (ఏపీఎల్ బ్రాండ్ అంబాసిడర్) శనివారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. అనంతరం రామ్ చరణ్ మాట్లాడుతూ, ప్రధానిని కలవడం తమకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని తెలిపారు. దేశంలో అద్భుతమైన ప్రతిభ ఉందని, దాన్ని అంతర్జాతీయ వేదికలపైకి తీసుకెళ్లడంలో ఏపీఎల్ ఒక మంచి వేదికగా మారుతుందని ఆయన అన్నారు.
“ఆర్చరీ ప్రీమియర్ లీగ్ లక్ష్యాన్ని మేము ప్రధానికి వివరించాం. మన సాంస్కృతిక వారసత్వంలో భాగమైన విలువిద్యకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలన్నదే మా ఆశయం,” అని రామ్ చరణ్ వివరించారు.
ప్రధానమంత్రి నుంచి ప్రశంసలు అందుకున్న ఉపాసన కొణిదెల వెంటనే స్పందించారు. “మిమ్మల్ని కలవడం మాకు గర్వకారణం. క్రీడలకు మీరు అందిస్తున్న ప్రోత్సాహం ఎంతో స్ఫూర్తినిస్తుంది. క్రీడల ద్వారా భారతదేశం మానసికంగా, శారీరకంగా మరింత మెరుగుపడుతుందని నేను విశ్వసిస్తున్నాను,” అని ఆమె ‘ఎక్స్’ వేదికగా ధన్యవాదాలు తెలియజేశారు.
