SS Rajamouli: ‘వారణాసి’ ఈవెంట్ వివాదం.. ఎస్.ఎస్. రాజమౌళిపై ఫిర్యాదు
SS Rajamouli: ప్రముఖ దర్శకులు ఎస్.ఎస్. రాజమౌళి తాజాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. మహేష్ బాబుతో రాబోతున్న తన చిత్రం ‘వారణాసి’కి సంబంధించిన ‘గ్లోబ్‌ట్రాటర్’ ఈవెంట్‌లో ఆయన హనుమంతుడి గురించి చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది.
రాష్ట్రీయ వానరసేన సంఘం సభ్యులు ఈ ఫిర్యాదును దాఖలు చేశారు. రాజమౌళి చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆరోపిస్తూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై దర్యాప్తు ప్రారంభించినట్లుగా పోలీసులు మీడియాకు వెల్లడించారు. రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న ‘వారణాసి’ చిత్ర టైటిల్ లాంఛ్ ఈవెంట్‌ను ఇటీవల అట్టహాసంగా నిర్వహించారు. అయితే, ఈ కార్యక్రమం జరుగుతుండగా, ఊహించని విధంగా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఈవెంట్‌కు కొంతసేపు అంతరాయం కలిగింది.
ఈ సందర్భంగా రాజమౌళి తీవ్ర భావోద్వేగానికి గురై తన వ్యక్తిగత నమ్మకాల గురించి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ, “నాకు నిజంగా దేవుడిపై నమ్మకం లేదు. ఈ అంతరాయం కలిగిన వెంటనే మా నాన్న (విజయేంద్ర ప్రసాద్) నా దగ్గరకు వచ్చి, ‘హనుమంతుడు మన వెనక ఉండి నడిపిస్తాడు’ అని చెప్పారు. ఆ మాట వినగానే నాకు చాలా కోపం వచ్చింది” అని తెలిపారు.
రాజమౌళి మరింత వివరిస్తూ, “నా భార్యకు హనుమంతుడు అంటే చాలా ఇష్టం. ఆమె ఆయనను తన స్నేహితుడిలా భావిస్తుంది. అందుకే ఈ విషయంపై నా భార్య మీద కూడా నాకు కోపం వచ్చింది. ‘ఇలానేనా ఆ దేవుడు చేసేది’ అనిపించింది” అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కొందరు ఆయన అభిప్రాయాన్ని గౌరవిస్తున్నప్పటికీ, రాజమౌళి స్థాయి వ్యక్తి ఇలాంటి వేదికపై దైవాన్ని ఉద్దేశించి మాట్లాడటం తగదని, ఇది మతపరమైన మనోభావాలను కించపరిచేలా ఉందని పలువురు హిందూ సంఘాల నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫిర్యాదుతో ఈ వివాదం ఇప్పుడు మరింత ముదిరింది.
