Political Schedule of Chandrababu : రాజకీయంగా చంద్రబాబు కొత్త వ్యూహం.. వైసీపీ నేతల్లో కొత్త టెన్షన్..
Political Schedule of Chandrababu : ఏపీలో రాజకీయం మరో ఊపందుకోనుంది. స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో అరెస్ట్ ఈ మధ్యనే బెయిల్ పై బయటికి వచ్చిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, మళ్ళీ పొలిటికల్ గా యాక్టివ్ కాబోతున్నారు. హైకోర్ట్ ఆయనకు షరతులు లేకుండా బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దింతో రాజకీయ యాత్రలు మొదలు పెట్టడానికి చంద్రబాబు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి ఉమ్మడి కార్యక్రమాలు చేపట్టేందుకు ఆయన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని వినికిడి. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో 53 రోజుల పాటు చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు కొన్ని కార్యక్రమాలకు సంబంధించి రూపకల్పన చేసి, ఇప్పుడు వాటి అమలుకై ఆయన సిద్ధమవుతున్నారని టిడిపి కీలక నేతలు చెబుతున్నారు. ఈనెల 29 నుంచి ఆయన యాక్టివ్ గా పాల్గొంటారని టిడిపి వర్గాలు పేర్కొంటున్నాయి. అదేవిధంగా పార్టీలో నిలిచిపోయిన అన్ని కార్యక్రమాలను ఆయన తిరిగి ప్రారంభించనున్నారు.

27న టీడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర కూడా మొదలుపెట్టనున్నారు. డిసెంబర్ నెలాఖరుకు ఈ యాత్రను ముగించాలని పట్టుదలతో లోకేష్ ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు నారా భువనేశ్వరి చేపట్టిన సంఘీభావ యాత్ర చంద్రబాబు విడుదల తర్వాత అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇప్పుడు ఆమె మరలా తిరిగి యాత్రను కొనసాగించాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.
డిసెంబర్ మొదటి వారం నుండి రాష్ట్రవ్యాప్తంగా భువనేశ్వరి పర్యటన ఉండేవిధంగా చంద్రబాబు నాయుడు ప్లాన్ చేశారు. ఇప్పటికి దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ కూడా ఆయన సిద్ధం చేసినట్లు సమాచారం. వారానికి మూడు రోజులపాటు భువనేశ్వర్ పర్యటనలు ఉండేలాగా షెడ్యూల్ ని రూపొందించారు. ఇక జనసేనతో పొత్తులో సీట్ల కేటాయింపు రాబోయే రోజుల్లో వ్యూహాలు అనుసరించాలని వాటిపైన ప్రత్యేక దృష్టి చంద్రబాబు పెట్టినట్లు సమాచారం.
టీడిపి బలహీనంగా ఉన్నచోట్ల అదేవిధంగా వైసీపీ బలంగా ఉన్నచోట్ల చంద్రబాబు ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ఒకవైపు చంద్రబాబు, మరోవైపు లోకేష్, ఇంకోవైపు పవన్ కళ్యాణ్ ఇలా ముగ్గురు ఏకధాటిగా ప్రచారం చేస్తుండడంతో ఏపీలో రాజకీయం హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు రాకతో వైసీపీలో ఒక అలజడి మొదలైందని తెలుస్తుంది.
