Fauji Photo Leak: ప్రభాస్ ‘ఫౌజీ’ ఫోటో లీక్.. సీరియస్ వార్నింగ్ ఇచ్చిన ప్రొడక్షన్ హౌజ్
Fauji Photo Leak: ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఒకటి. దీనికి ‘ఫౌజీ’ అనే వర్కింగ్ టైటిల్ ప్రచారంలో ఉంది. అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్న తరుణంలో, ఇటీవల సినిమా సెట్స్ నుండి ప్రభాస్ లుక్ ఒకటి లీక్ అయి నెట్టింట కలకలం సృష్టించింది. ఇందులో ప్రభాస్ ఒక వింటేజ్ లుక్‌లో కనిపించడంతో, ఆ ఫోటో క్షణాల్లో వైరల్ అయింది. ఇది చిత్ర నిర్మాణ సంస్థకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది.
ఈ లీక్‌పై నిర్మాణ సంస్థ తీవ్రంగా స్పందించింది. ఒక అధికారిక ప్రకటనలో, అనధికారికంగా షేర్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. “మా సినిమా కోసం ఎంత మంది అభిమానులు ఎదురుచూస్తున్నారో మాకు తెలుసు. ఈ అంచనాలను దృష్టిలో పెట్టుకుని, ఒక అద్భుతమైన సినిమాటిక్ అనుభవాన్ని అందించడానికి మా బృందం నిరంతరం శ్రమిస్తోంది. ఇలాంటి లీక్‌లు మా టీమ్ నైతికతను దెబ్బతీస్తాయి. భవిష్యత్తులో, ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి ఫోటోలు, వీడియోలు అనధికారికంగా షేర్ చేసినా, వాటిని సైబర్ నేరంగా పరిగణించి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. వారి సోషల్ మీడియా ఖాతాలను కూడా తొలగిస్తాం” అని స్పష్టం చేసింది.
‘ఫౌజీ’ విషయానికొస్తే, ఇది 1940వ దశకం నేపథ్యంలో సాగే ఒక పీరియాడికల్ యాక్షన్ డ్రామా. ఈ సినిమాలో ప్రభాస్ సైనికుడిగా నటిస్తున్నారు. ప్రజలకు న్యాయం అందించేందుకు ఒక యోధుడు చేసే పోరాటమే ఈ కథాంశం. వాస్తవ సంఘటనలకు ఫిక్షన్ జోడించి హను రాఘవపూడి ఈ కథను రాశారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన సోషల్ మీడియా స్టార్ ఇమాన్వీ ఇస్మాయిల్ నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి.