Prabhas Hanu Raghavapudi: ప్రభాస్-హను రాఘవపూడి సినిమా.. ‘కర్ణుడి’ పోస్టర్‌తో ఉత్కంఠ పెంచిన టీమ్
Prabhas Hanu Raghavapudi: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు ఇది నిజంగా పండగ లాంటి వార్త. ప్రస్తుతం చేతినిండా భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న డార్లింగ్ ప్రభాస్… దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా చిత్రం గురించి ఆసక్తికరమైన అప్‌డేట్ తాజాగా వెలువడింది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వర్కింగ్ టైటిల్ ‘ఫౌజీ’గా ప్రచారం జరుగుతున్నప్పటికీ, రేపు ఉదయం అధికారిక టైటిల్‌ను ప్రకటించనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.
ఈ మేరకు చిత్రబృందం విడుదల చేసిన ఒక ప్రత్యేక పోస్టర్ సోషల్ మీడియాలో విపరీతంగా ఆకట్టుకుంటోంది. ‘పాండవుల పక్షాన ఉన్న కర్ణుడు..’ అనే క్యాప్షన్, పోస్టర్‌పై ఉన్న ట్యాగ్‌లైన్‌లు అంచనాలను మరింత పెంచాయి. ‘1932 నుంచి ఇతడి కోసం అందరూ వెతుకుతున్నారు’, ‘ఒంటరిగా పోరాడిన బెటాలియన్’ వంటి ఆసక్తికరమైన నినాదాలు కథాంశంపై గొప్ప ఉత్సుకతను కలిగిస్తున్నాయి.
సీతారామం వంటి అద్భుతమైన ప్రేమకథతో ప్రేక్షకులను మెప్పించిన హను రాఘవపూడి… ఇప్పుడు ప్రభాస్‌తో కలిసి ఒక విభిన్నమైన, భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామాను తెరకెక్కిస్తుండటం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రంలో ప్రభాస్ ఒక సైనికుడి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా ఈ కథ 1930వ దశకపు నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. మాతృభూమికి, ప్రజలకు న్యాయం అందించడానికి ఒక యోధుడు చేసే సాహసోపేతమైన పోరాటమే ఈ సినిమా ప్రధాన ఇతివృత్తం. వాస్తవ సంఘటనలకు కొంత కల్పిత కథాంశాన్ని జోడించి హను రాఘవపూడి ఈ కథనాన్ని సిద్ధం చేశారు. సోషల్ మీడియాలో పెద్ద ఫాలోయింగ్ ఉన్న ఇమాన్వీ, ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా నటిస్తోంది. రేపు టైటిల్ ప్రకటన తర్వాత సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ భారీ పీరియాడికల్ యాక్షన్ డ్రామా కోసం ప్రభాస్ అభిమానులు, సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
