Prabhas: జపాన్‌లో ప్రభాస్ ‘బాహుబలి’ సందడి.. రాజమౌళి ఎమోషనల్ లెటర్ వైరల్
Prabhas: భారతీయ సినీ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన అగ్ర కథానాయకుడు ప్రభాస్, ప్రస్తుతం తూర్పు దేశం జపాన్‌లో అభిమానుల ప్రేమాభిమానంలో మునిగి తేలుతున్నారు. ఆయన కెరీర్‌ను మలుపు తిప్పిన, దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి రూపొందించిన ‘బాహుబలి’ చిత్రం రెండు భాగాలు కలిపి, ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో ఈనెల డిసెంబర్ 12న జపాన్ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా, ప్రభాస్ అక్కడి ప్రచార కార్యక్రమాలలో ఉల్లాసంగా పాల్గొంటున్నారు.
జపాన్ అభిమానుల నుంచి ప్రభాస్‌కు లభించిన అద్భుతమైన స్వాగతం, ఆప్యాయతను చూసి దర్శకుడు రాజమౌళి కూడా ఉద్వేగానికి లోనయ్యారు. ఈ నేపథ్యంలో, రాజమౌళి స్వయంగా ప్రభాస్‌కు ఒక హృదయపూర్వక లేఖ రాశారు. ఆ లేఖను ప్రభాస్ తన సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో, అది తక్కువ సమయంలోనే వైరల్‌గా మారింది.
రాజమౌళి తన లేఖలో.. “జపాన్‌లో నీకు ఎంతటి అభిమానం ఉందో ఇప్పటికే నీకు అర్థమై ఉంటుంది. వారి ప్రేమను చూసి నీ కళ్లల్లో ఆనంద బాష్పాలు వస్తాయని నాకు తెలుసు. నేను జపాన్‌కు నాలుగు సార్లు వెళ్లాను. వెళ్లిన ప్రతిసారీ నన్ను ఒక్కటే ప్రశ్న అడిగేవారు. ‘ప్రభాస్ ఎప్పుడు వస్తారు?’ అని అడిగేవారు. ఇన్ని రోజులకు వారి కోరిక ఫలించింది. నా బాహుబలి ఇప్పుడు అక్కడ సందడి చేస్తున్నాడు” అని రాశారు. జపాన్‌లోని అభిమానులకు మరోసారి ధన్యవాదాలు కూడా తెలిపారు.
రాజమౌళి రాసిన ఈ ఎమోషనల్ లెటర్‌కు అటు అభిమానులతో పాటు, సినీ ప్రముఖుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా ఈ పోస్ట్‌ను లైక్ చేయడం గమనార్హం. జపాన్ పర్యటనలో భాగంగా, ప్రభాస్‌కు ఘన స్వాగతం లభించింది. ‘బాహుబలి’ చిత్రంలోని పాత్రలు, బొమ్మలతో జపనీస్ భాషలో ఏర్పాటు చేసిన బోర్డులను చూసి ఆనందించిన ప్రభాస్, వాటిపై ఆటోగ్రాఫ్‌లు ఇచ్చారు. అంతేకాకుండా, సినిమాలోని తన డైలాగులతో అక్కడి అభిమానులను ఉర్రూతలూగించారు. ప్రస్తుతం ఈ వీడియోలు మరియు రాజమౌళి లేఖ సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ట్రెండ్ అవుతున్నాయి.
