Kantara Chapter 1: ‘కాంతార: ఛాప్టర్ 1’పై సందీప్ రెడ్డి వంగా పొగడ్తల వర్షం.. బ్రిలియంట్ మూవీ అంటూ ప్రభాస్ ప్రశంసలు
Kantara Chapter 1: దసరా పండుగ కానుకగా అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా విడుదలైన ‘కాంతార: చాప్టర్ 1’ చిత్రం అంచనాలకు మించి సంచలనం సృష్టిస్తోంది. రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్-ఇండియా ఫాంటసీ డ్రామా, భక్తి, మానవత్వం, దైవత్వం వంటి అంశాల మేళవింపుతో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. తొలి భాగాన్ని మించిన స్థాయిలో రెండో భాగం ఉందని ప్రేక్షకులు, విమర్శకులు ఏకగ్రీవంగా ప్రకటిస్తున్నారు.
సినిమా విడుదలైన వెంటనే జూనియర్ ఎన్టీఆర్ చిత్రబృందాన్ని అభినందించగా, తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా ఈ సినిమాపై ఆసక్తికరమైన కామెంట్లు చేశారు.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని “నిజమైన మాస్టర్ పీస్” అంటూ ప్రశంసించారు. “భారతీయ సినీ చరిత్రలో ఇంతటి శక్తివంతమైన సినిమాను నేను ఎప్పుడూ చూడలేదు. ఇది కేవలం సినిమా కాదు, ఒక సినిమాటిక్ ప్రభంజనం. భక్తిని, ఆధ్యాత్మికతను రిషబ్ ఎంత అద్భుతంగా చూపించాడో మాటల్లో చెప్పలేం. ఇది కేవలం ఆయన ఒంటిచేత్తో తీసిన సినిమానే కాదు, ఒక అసాధారణ ఆధ్యాత్మిక ప్రయాణం. ముఖ్యంగా, సినిమా బీజీఎం (BGM) ఎంతో అద్భుతంగా ఉంది,” అని ఆయన కితాబిచ్చారు.
ప్రభాస్ కూడా తన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ ‘కాంతార: చాప్టర్ 1’ను “బ్రిలియంట్ మూవీ”గా అభివర్ణించారు. “ఈ చిత్రం కచ్చితంగా ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుంది. ఈ సినిమాకు అసలైన బలం రిషబ్ శెట్టి అసాధారణ నటనే. ఆయన నటనలో కనిపించిన భక్తి, శక్తి అమోఘం. నిర్మాత విజయ్ కిరగండూర్ అద్భుతంగా సినిమాను నిర్మించారు. చిత్ర యూనిట్‌కు నా హృదయపూర్వక అభినందనలు,” అని ప్రభాస్ పేర్కొన్నారు.
మొదటగా, జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ, “ఈ సినిమా ప్రేక్షకులను కచ్చితంగా మరో స్థాయికి తీసుకెళ్తుంది. రిషబ్ శెట్టికి నా ప్రత్యేక శుభాకాంక్షలు,” అంటూ ట్వీట్ చేశారు. కేవలం స్టార్ హీరోల నుంచి మాత్రమే కాక, విమర్శకుల నుంచి కూడా ఈ చిత్రానికి హై రేటింగ్స్ వస్తున్నాయి. డివోషనల్ సబ్జెక్ట్‌ను కళాత్మకంగా, కమర్షియల్‌గా చూపించి ప్రేక్షకులను ఆలోచింపజేసేలా తీర్చిదిద్దిన రిషబ్ శెట్టి విలక్షణమైన ఆలోచనా విధానం మరోసారి నిరూపితమైంది.