Spirit Movie: విదేశాల్లో ‘స్పిరిట్’ ఫస్ట్ షెడ్యూల్.. ప్రభాస్ ఎప్పుడు వెళ్తున్నాడంటే..?
Spirit Movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రానున్న బహుభాషా చిత్రం ‘స్పిరిట్’ గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పలు కీలక అప్‌డేట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ భారీ యాక్షన్ డ్రామా సెప్టెంబర్ చివరి వారంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. ఇందులో ప్రభాస్ శక్తిమంతమైన పోలీసు అధికారిగా కనిపించనుండగా, ‘యానిమల్’ బ్యూటీ త్రిప్తి దిమ్రి కథానాయికగా నటించనుంది.
విదేశాల్లో మొదటి షెడ్యూల్
‘స్పిరిట్’ సినిమా తొలి షెడ్యూల్ విదేశాల్లో జరగనుందని తెలుస్తోంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇప్పటికే మెక్సికో, ఇండోనేషియా, మలేషియా, బ్యాంకాక్ వంటి దేశాల్లో లొకేషన్లను పరిశీలించి వచ్చారు. సినిమాలోని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడే చిత్రీకరించాలని ఆయన యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ‘ది రాజా సాబ్’, ‘ఫౌజీ’ చిత్రాలతో బిజీగా ఉన్న ప్రభాస్, నవంబర్ నెలలో ‘స్పిరిట్’ టీమ్‌తో చేరనున్నారు.
సంగీతం, నిర్మాణ వివరాలు
ఈ చిత్రాన్ని ప్రణయ్ రెడ్డి వంగా, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘యానిమల్’ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకు కూడా సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన ఇప్పటికే పాటలను సిద్ధం చేసినట్లు సమాచారం. హర్షవర్ధన్ ‘యానిమల్’ చిత్రానికి అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఎంతగానో ఆకట్టుకోవడంతో, ‘స్పిరిట్’ కోసం కూడా సంగీత ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
హీరోయిన్‌గా త్రిప్తి దిమ్రి
‘స్పిరిట్’లో కథానాయికగా త్రిప్తి దిమ్రిని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. మొదట ఈ పాత్ర కోసం దీపికా పదుకొణేతో సంప్రదింపులు జరిపారు. అయితే పని గంటల విషయంలో దీపికాకు, స్పిరిట్ మూవీ టీమ్‌కు కుదరకపోవడంంతో దీపికా పదుకొణే స్థానంలో త్రిప్తి దిమ్రి వచ్చి చేరింది. త్రిప్తి దిమ్రి ‘యానిమల్’ చిత్రంలో తన పాత్రతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు ‘స్పిరిట్’లోనూ ఆమె నటిస్తుండటంతో.. సందీప్ రెడ్డి వంగాతో వరుసగా మూడు సినిమాలు (యానిమల్, యానిమల్ పార్క్, స్పిరిట్) చేసిన ఘనతను ఆమె సొంతం చేసుకున్నారు. ఆమె పాత్ర ఎలా ఉండనుందో చూడాలి.
