Raja Saab: ఫ్యాన్స్‌కు పూనకాలే.. ‘రాజా సాబ్’ నుంచి క్రేజీ అప్డేట్.. ‘రెబల్ సాబ్’ వచ్చేది అప్పుడే
Raja Saab: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా అంటేనే బాక్సాఫీస్ వద్ద పండగ వాతావరణం నెలకొంటుంది. ‘కల్కి 2898 AD’ వంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘ది రాజా సాబ్’. వినోదాత్మక చిత్రాల దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. చాలా కాలం తర్వాత ప్రభాస్ ఒక పూర్తిస్థాయి ఎంటర్టైనర్, హారర్ టచ్ ఉన్న కథలో కనిపిస్తుండటంతో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ నిరీక్షణకు తెరదించుతూ చిత్ర యూనిట్ తాజాగా ఓ అదిరిపోయే అప్డేట్ను వదిలింది.
ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్లు సినిమాపై హైప్ పెంచేయగా.. ఇప్పుడు మ్యూజికల్ ప్రమోషన్స్‌ను కిక్ స్టార్ట్ చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ సినిమా నుంచి మోస్ట్ అవైటెడ్ ఫస్ట్ సింగిల్ ‘రెబల్ సాబ్’ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈ మాస్ నంబర్‌ను నవంబర్ 23న గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన కొత్త పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇందులో ప్రభాస్ స్టైలిష్ లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తుండటం విశేషం. తమన్ మాస్ బీట్స్, ప్రభాస్ డ్యాన్స్ కలిస్తే థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
అలాగే బాలీవుడ్ దిగ్గజ నటులు సంజయ్ దత్, బోమన్ ఇరానీ, సీనియర్ నటి జరీనా వహబ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. ప్రస్తుతానికైతే నవంబర్ 23న రాబోయే ‘రెబల్ సాబ్’ కోసం సోషల్ మీడియాలో కౌంట్‌డౌన్ మొదలైంది.
